వర్షం పడినప్పుడు ఉరుములు, మెరుపులు రావడం సహజం. ఆ మెరుపుల్లో కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పొడవుగా కాస్త భారీగా పరుచుకుని ఉంటాయి. కానీ ఒకే మెరుపు వందల కిలోమీటర్ల మేర ఆకాశంలో పరుచుకుంటే అది వింతల్లోనే వింత. అదే జరిగిందిప్పుడు. అమెరికాలో ఒక మెరుపు 768 కిలోమీటర్ల పొడవుతో ఏర్పడింది. ఆ దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఈ మెరుపు కనిపించింది. ఇంత పెద్ద మెరుపు ఇంతకుముందు ఎప్పుడూ ఏర్పడలేదు. అందుకే దీన్ని ‘మెగా ఫ్లాష్’అని పిలుస్తున్నారు. తెలుగులో మనం ‘మెగా మెరుపు’ అని పిలుచుకోవచ్చు.
ప్రపంచ వాతావరణ సంస్థ ఈ మెరుపు ఏర్పడటాన్ని కనిపెట్టి పొడవును అంచనా వేసి ప్రపంచానికి చెప్పింది. ఫిబ్రవరి 1న ఈ వింత ఏర్పడినట్టు తెలిపింది. దీన్ని ప్రపంచరికార్డుగా చెప్పింది ప్రపంచ వాతావరణ సంస్థ. ఈ మెరుపు అమెరికాలోని మిస్సిసిపి, లూసియానా, టెక్సాస్ రాష్ట్రాల్లోని ఆకాశంలో విస్తరించినట్టు గుర్తించింది. 2019లో అక్టోబర్ 31న దక్షిణ బ్రెజిల్ లో ఏర్పడిన భారీ మెరుపు కన్నా తాజా మెరుపు 60 కిలోమీటర్లు ఎక్కువ పొడవును కలిగి ఉంది. ఒక మెరుపులో 1.2 బిలియన్ కిలో వాట్ అవర్ విద్యుత్తు ఉంటుంది. ఈ విద్యుత్తు ఒక నగరానికి ఆరునెలల పాటూ అవసరమయ్యే విద్యుత్తుతో సమానం. ఇక భారీ మెరుపుల్లో ఉండే విద్యుత్తు కొన్ని రెట్లు అధికంగా ఉంటుంది.
మెరుపులు ఇలా ఏర్పడతాయి
నీటి ఆవిరితో మేఘాలు ఏర్పడతాయన్న సంగతి తెలిసిందే. అవి మరీ ఎత్తుగా ఉండవు, కేవలం భూమికి రెండు కిలోమీటర్ల ఎత్తులోనే తిరుగుతూ ఉంటాయి. అందులోని నీటి అణువులు అత్యధిక వేగంతో చలిస్తూ ఉంటాయి. నీటి అణువులు అధికంగా రాపిడికి గురైనప్పుడు ఉరుముల్లా శబ్ధాలు వస్తాయి. ఆ నీటి అణువుల రాపిడిలో విరుద్ధ విద్యుత్ ఆవేశాలు జనిస్తాయి. ఆ రెండింటి కలయిక వల్ల ఎలక్ట్రాన్లు ఏర్పడతాయి. అవి విద్యుత్ క్షేత్రంగా మారి చాలా వేగంగా భూమి మీదకు దూసుకొస్తాయి. అదే మెరుపు.