ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ2 వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. దక్షిణాఫ్రికాలో తొలిసారి గుర్తించిన దాని కంటే అత్యంత వేగంగా ఇది వ్యాప్తి చెందుతున్నట్టు పలు అధ్యయనాలు సూచిస్తున్నాయని హెచ్చరించింది. ఈ వేరియంట్ ఇప్పటివరకు మొత్తం 57 దేశాల్లో గుర్తించినట్టు పేర్కొంది.






93 శాతం..


గత నెలలో సేకరించిన మొత్తం కరోనా వైరస్ నమూనాలలో 93 శాతానికిపైగా ఒమిక్రాన్ వేరియంట్, దాని ఉప వర్గాలు BA.1, BA.1.1, BA.2, BA.3 ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.


సబ్-వేరియంట్స్ మధ్య వ్యత్యాసాల గురించి చాలా స్వల్ప సమాచారం ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వేరియంట్ వ్యాప్తితో పాటు లక్షణాలు, రోగనిరోధక శక్తిపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది అధ్యయనం చేపట్టాలని పిలుపునిచ్చింది. కాగా, BA.2 వేరియంట్ అసలు ఒమిక్రాన్ కంటే ఎక్కువ వ్యాప్తి చెందుతున్నట్టు పలు అధ్యయనాలు సూచించాయి.


ఒమిక్రాన్​ అసలు వైరస్​ కన్నా, దాని ఉప వేరియంట్​ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లు డెన్మార్క్​ శాస్త్రవేత్తలు కూడా తెలిపారు. ఒమిక్రాన్​ అసలు వేరియంట్​(బీఏ1), దాని ఉప వేరియంట్​(బీఏ2)ల వ్యాప్తి తీరు ఎలా ఉందన్న విషయమై స్టాటెన్స్​ సీరం ఇన్​స్టిట్యూట్​, యూనివర్సిటీ ఆఫ్​ కోపెన్​ హేగన్​, టెక్నికల్​ యూనివర్సిటీ ఆఫ్​ డెన్మార్క్​ పరిశోధకులు ఇటీవల దృష్టి సారించారు.


కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చేపట్టిన మరో పరిశోధనలోనూ ఇలాంటి ఫలితాలే వెల్లడయ్యాయి. ఒమిక్రాన్​ వేరియంట్ల కారణంగా కొవిడ్​కు గురై, స్వస్థత పొందినవారూ బూస్టర్​ డోసు తీసుకోవడం ముఖ్యమని వీరు తెలిపారు. భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త వేరియంట్ల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందన్నారు.


Also Read: India Corona Cases: దేశంలో నిన్న ఒక్కరోజులో 1,733 కరోనా మరణాలు.. కొత్తగా లక్షన్నర మందికి కొవిడ్


Also Read: PM e-Vidya: వన్ క్లాస్- వన్ టీవీ ఛానెల్.. హైక్వాలిటీ కంటెంట్‌తో 200 టీవీ ఛానెళ్లు.. బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపు ఇదీ..