బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన తాజా సినిమా ‘భీద్’. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 24న విడుదల అయ్యింది. ఈ చిత్రాన్ని అనుభవ్ సిన్హా స్వయంగా నిర్మించారు. కరోనా, లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ పట్ల ప్రేక్షకుల నుంచి మిత్రమ స్పందన లభిస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో హీరో రాజ్ కుమార్ రావు లుక్ చూసి, తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు చర్చించుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.


ఆ వార్తలు వింటే నవ్వొస్తుంది- రాజ్ కుమార్ రావు


‘భీద్’ సినిమాలో మీ లుక్ చూసి అందరూ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు చర్చించుకుంటున్నారు? దీనిపై మీ స్పందన ఏంటనే ప్రశ్నకు ఆయన కూల్ గా సమాధానం చెప్పారు. ఇలాంటి వార్తలు వింటుంటే తనకు నవ్వు వస్తుందని చెప్పుకొచ్చారు. “అలాంటిదేమీ లేదు. నేను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోలేదు. జనాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది విన్నప్పుడు నాకైతే బాగా నవ్వు వస్తుంది” అని రాజ్ కుమార్ రావు వివరించారు.


తొలి నాళ్లలో ఎన్నో అవమానాలు


వాస్తవానికి రాజ్‌ కుమార్‌ రావు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన తొలి రోజుల్లో చాలా ఇబ్బందులను, అవమానాలు ఎదుర్కొన్నారు. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ బాడీ షేమ్ చేశారు. అందంగా లేడు, ఎత్తుగా లేడు, ఈ క్యారెక్టర్ కు సూట్ కావు అంటూ చిన్నబుచ్చుకునేలా మాట్లాడారు. తన నటన బాగుందా? లేదా? అని చూడకుండా సూటిపోటి మాటలతో హింసించారు. చాలా సార్లు తనకు జరిగిన అవమానాలను ప్రస్తావించారు. తనకు అందం లేకపోవడం వల్ల చాలా సార్లు తిరస్కరణకు గురైనట్లు చెప్పుకొచ్చారు. 2010లో రామ్ గోపాల్ వర్మ ‘రన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.


దివాకర్ బెనర్జీ చిత్రాలతో మంచి గుర్తింపు


అందంగా లేకపోయినా, దర్శకుడు దివాకర్ బెనర్జీ తనలోని టాలెంట్ ను చూసి అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. ‘రణ్’ మూవీలో న్యూస్ రీడర్ గా కనిపించి మెప్పించారు. ఆ తర్వాత  దివాకర్ బెనర్జీ చిత్రాలు ‘హిట్’, ‘లవ్ సెక్స్ ఔర్ ధోఖా’ ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. బాలీవుడ్‌లో ఆయన కెరీర్‌కు బాటలు వేశాయి. ‘షాహిద్‌’, ’కాయ్‌ పోచె’, ‘అలీఘడ్‌’, ‘న్యూటన్‌’, ‘స్త్రీ’, ‘జడ్జ్‌ మెంటల్‌ హై క్యా’, ‘లూడో’ లాంటి చిత్రాలతో ప్రశంసలే కాకుండా అవార్డులు సైతం అందుకున్నారు. 2013లో, హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ‘షాహిద్’లో నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. 2010లో ముంబైలో హత్యకు గురైన న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త షాహిద్ అజ్మీ పాత్రను ఈ సినిమాలో పోషించారు. గత సంవత్సరం,  ‘బదాయి దో’లో పోలీసు అధికారిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హుమా ఖురేషి, రాధికా ఆప్టే, సికందర్ ఖేర్, ఆకాంక్ష రంజన్ కపూర్‌లతో కలిసి  వాసన్ బాలా నియో-నోయిర్ థ్రిల్లర్ ‘మోనికా ఓ మై డార్లింగ్‌’లోనూ బాగా నటించారు. అటు రాజ్, డీకే పీరియాడికల్ డ్రామా సిరీస్ ‘గన్స్ & గులాబ్స్‌’లో ఆకట్టుకున్నారు. తాజా ‘భీద్’ సినిమాలో మరోమారు పోలీసు అధికారిగా కనిపించారు.






Read Also: రీ రిలీజ్ కు రెడీ అయిన నితిన్ హిట్ మూవీ, విడుదల ఎప్పుడో తెలుసా?