AFG vs PAK T20: ‘మా దేశానికి రావడానికి భారత్ భయపడుతోంది. వాళ్లకు ఓటమి భయం..’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఒకతను అవాకులు చెవాకులు పేలాడు. ఆసియా కప్ లో భాగంగా భారత్ మ్యాచ్ లు తటస్థ వేదికలపై నిర్వహించేందుకు గాను పాకిస్తాన్ క్రికెటర్ స్పందన అది. అయితే భారత్ భయపడుతుందనే సంగతి పక్కనబెడితే పాకిస్తాన్ మాత్రం అగ్రశ్రేణి జట్టైన భారత్ తో కాదు కదా.. అంతర్జాతీయ క్రికెట్ లో ఇంకా పసికూన ముద్రతోనే ఉన్న అఫ్గానిస్తాన్ ను కూడా ఓడించక చతికిలపడింది. అఫ్గాన్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లలో ఒక్కడు కూడా 20 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. పాక్ ను చిత్తుగా ఓడించిన అఫ్గాన్.. సూపర్ విక్టరీతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో బోణీ కొట్టింది.
యూఏఈ వేదికగా పాకిస్తాన్ - అఫ్గానిస్తాన్ ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా శుక్రవారం రాత్రి తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 92 పరుగులకే పరిమితమైంది. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన పాక్.. 9 వికెట్లు కోల్పోయి 92 రన్స్ మాత్రమే చేసింది. ఆ జట్టులో వికెట్ కీపర్ అజమ్ ఖాన్ (18) టాప్ స్కోరర్. అజమ్ ఖాన్ తో పాటు సయీమ్ అయూబ్ (17), తయ్యబ్ తాహిర్ (16), ఇమాద్ వసీం (12) లు డబుల్ డిజిట్ స్కోరు చేశారు.
అఫ్గాన్ బౌలర్లలో మాజీ సారథి మహ్మద్ నబి 3 ఓవర్లలో 12 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. పేసర్ ఫజుల్లా ఫరూఖీ 2, ముజీబ్ 2 వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ రషీద్ ఖాన్ తో పాటు నవీన్ ఉల్ హక్, అజ్మతుల్లాలకు తలా ఒక వికెట్ దక్కింది.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని అఫ్గానిస్తాన్.. 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బౌలింగ్ లో రాణించిన నబీ.. బ్యాటింగ్ లో కూడా మెరుగ్గా ఆడాడు. 38 బంతులు ఆడి 3 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రహ్మనుల్లా గుర్బాజ్ (16), నజీబుల్లా జద్రన్ (17 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.
ఈ విజయంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో అఫ్గాన్.. 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 ఆదివారం, సోమవారం మూడో మ్యాచ్ జరుగుతాయి. అఫ్గాన్ తో సిరీస్ కు పాక్ రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తో పాటు రిజ్వాన్, హరీస్ రౌఫ్, మహ్మద్ రిజ్వాన్ వంటి సీనియర్ ప్లేయర్లకు పాకిస్తాన్ రెస్ట్ ఇచ్చింది. జట్టులో సుమారు ఆరుగురు కొత్త కుర్రాళ్లే ఉన్నారు. ఇక ఏ ఫార్మాట్ లో అయినా అఫ్గాన్ కు పాకిస్తాన్ పై ఇదే తొలి విజయం. తర్వాత ఆడబోయే రెండు టీ20లలో ఏ ఒక్కటి నెగ్గినా అది చరిత్రే.