రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'లైగర్'. ఈ సినిమాకు సంబంధించిన ప్రతిదీ సెన్సేషన్ అవుతుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేసింది. రిలీజైన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్ లోనూ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు విజయ్ భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు. హాల్ అంతా అభిమానుల ఈలలు, చప్పట్లు, కేకలతో దద్దరిల్లింది. అభిమానుల హడావుడి చూసి మన లైగర్ కూడా అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. 


"నాకు ఈ రోజు ఏమీ అర్థం కావడం లేదు. మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయితుంది. రిలీజ్ అయిన సినిమా కూడా పెద్దగా చెప్పుకునే సినిమా కాదు. అయినా ట్రైలర్ కి ఈ రచ్చ ఏందిరా నాయన'' అంటూ విజయ్ దేవరకొండ సంతోషం వ్యక్తం చేశారు. టాలీవుడ్ లోని పెద్ద హీరోలను ఉద్దేశించి విజయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొంతమంది ఆరోపణలు చేశారు. దీనిపై బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చాడు. 'తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్ లా, రామ్ చరణ్ లా, మహేష్ బాబులా, ప్రభాస్ లా గుర్తు పెట్టుకో బ్రో' అని ట్వీట్ చేశాడు. అయితే ఇది అగ్ర హీరోలని ఉద్దేశించి ఇచ్చిన కౌంటర్ అని కొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతుంటే మరికొంతమంది మాత్రం విజయ్ కి భలే కౌంటర్ ఇచ్ఛావని సంబరపడుతున్నారు. అసలు ఇంతకీ ఈ కౌంటర్ ఎవరికి ఇచ్చారో బండ్లకే తెలియాలి. 


విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.


Also Read: మీకు మా అయ్య, తాత తెల్వదు! అయినా సరే ఏంది ఈ రచ్చ - ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే విజయ్ దేవరకొండ స్పీచ్