Balakrishna-Bobby Film New Schedule: నట సింహం నందమూరి బాలకృష్ణ  హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిపి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.  త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్ లో 109వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ మూవీ సంబంధించి తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది.  


ఈనెల 24 నుంచి ఊటీలో రెండో షెడ్యూల్ షూటింగ్


రాజకీయ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని బాబీ మంచి కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ కు రెడీ అవుతోంది. తాజా షెడ్యూల్ ను ఊటీలో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి అక్కడ షూటింగ్ మొదలు కానుంది. హీరోతో పాటు కీలక తారాగణానికి సంబంధించిన ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.  


బాలయ్య బర్త్ డే సందర్భంగా NBK109 ప్రారంభం


బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది జూన్ 10న పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను మేకర్స్ ప్రారంభించారు. అదే సమయంలో ఓ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. గొడ్డలి, సుత్తి, కత్తి సహా పలు మారణాయుధాలతో ఈ పోస్టర్ ను రూపొందించారు. 'వయలెన్స్ కి విజిటింగ్ కార్డు' అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్టర్ చూసి అభిమానులు బాలయ్య నుంచి మరో ఊచకోత మూవీ రాబోతోందంటూ కామెంట్స్ చేశారు. ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది వేసవికి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.   


'భగవంత్ కేసరి'తో దుమ్మురేపిన బాలయ్య  


విజయ దశమికి 'భగవంత్ కేసరి'తో థియేటర్లలోకి వచ్చారు బాలకృష్ణ. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకొని బ్లాక్ మాస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. యాక్షన్ తో పాటు సోషల్ మెసేజ్ ఉన్న ఈ చిత్రంలో బాలయ్య కూతురుగా శ్రీలీల అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా కనిపించారు. సైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.


Read Also: అమితాబ్‌ కు అరుదైన గౌరవం, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బిగ్ బి ఐకానిక్ చిత్రాల ప్రదర్శన


Read Also: త్రిషాపై కామెంట్స్ - నటుడు మన్సూర్ అలీపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్, పోలీసులకు కీలక ఆదేశాలు