బాబు మోహన్.. ఇటు సినీ పరిశ్రమలో, అటు రాజకీయ రంగంలో తెలుగు ప్రజలకు సుపరిచితం అయిన వ్యక్తి. ఖమ్మం జిల్లా బీరోలులో జన్మించిచారు. ఆయన తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. బాబు మోహన్ చదువు పూర్తయ్యాక రెవెన్యూ విభాగంగా ఉద్యోగం సంపాదించారు. కానీ, ఆయనకు సినిమాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ‘ఈ ప్రశ్నకు బదులేది’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తను నటించిన ‘మామగారు’ సినిమాలో బిక్షగాడి పాత్రవేసి కమెడియన్ గా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘పెదరాయుడు’, ‘జంబలకిడి పంబ’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించి ఓ రేంజిలో గుర్తింపు పొందారు. ఇక ‘మాయలోడు’ సినిమాతో స్టార్ కమెడియన్ అయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.
సంక్షేమశాఖ మంత్రిగా పని చేసిన బాబు మోహన్
ఇక ఎన్టీఆర్ అంటే బాబు మోహన్ కు చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానం. ఆయనపై ఉన్న ప్రేమతోనే తెలుగుదేశం పార్టీలో చేరారు. తొలిసారిగా 1999లో మెదక్ జిల్లా ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడే సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పని చేశారు. 2004, 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర రాజనర్సింహ మీద టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.
కేసీఆర్ మోసం చేశారు!
బాబు మోహన్ తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఉన్నంత కాలం తాను పార్టీని వీడలేదని చెప్పారు. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ కు లేఖ ఇచ్చిన తర్వాతే.. కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరినట్లు చెప్పారు. 2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కేసీఆర్.. 2018 ఎన్నికలకు వచ్చే సరికి తనకు చెప్పకుండా మరో వ్యక్తికి టికెట్ ఇచ్చారని చెప్పారు. టికెట్ ఇవ్వకపోవడంతో వెళ్లి కలుద్దామని ప్రయత్నించినా.. కలిసే అవకాశం ఇవ్వలేదన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేకే బీజేపీలోకి వెళ్లినట్లు చెప్పారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడంలో కేసీఆర్ కీరోల్
అటు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు నాయుడు ఐదారుగురు నాయకులతో కలిసి కుట్ర చేశారని, వారిలో కేసీఆర్ ఒకడని చెప్పారు. చంద్రబాబు, కేసీఆర్ ను గురుశిష్యులుగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్ తో పోల్చితే చంద్రబాబు మేధావి అన్నారు. కేసీఆర్ కూడా మేధావే అయినా.. వంకర్లు టింకర్లు తిప్పడంలో మేధావి అన్నారు. ఇప్పటికే ఆయన మేధావితనం గురించి జనాలకు తెలిసిందన్నారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాభవం ఖాయమని బాబు మోహన్ వ్యాఖ్యానించారు.
Read Also: పెళ్లికూతురుగా కీర్తి సురేష్ - బర్త్‌డే గిఫ్ట్ అదుర్స్, బరాత్‌లో మహానటి రచ్చ!