Ayushmann Khurrana On Kolkata Doctor Rape And Murder: కోల్‌కతాలోని ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో లేడీ జూనియర్ డాక్టర్ పై జరిగిన దారుణ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఢిల్లీ నిర్భయ ఘటనను గుర్తు చేసేలా ఉన్న ఈ అమానుష ఘటనపై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. దారుణానికి పాల్పడిన కిరాతకులకు కఠిన శిక్ష విధించాలంటూ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పలువురు సినీ తారలు ఇప్పటికే ఈఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులు ఎవరైనా శిక్ష పడితీరాలని డిమాండ్ చేశారు.


కవితతో నివాళి అర్పించిన ఆయుష్మాన్ ఖురానా   


ఈ ఘోరంపై బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కవిత ద్వారా ఆమె పడిన వేదనను చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు తన ఇన్ స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. ‘నేను అబ్బాయిని అయితే..’ అంటూ ఆయన రాసిన కవితను వినిపించారు. ఈ కవిత అందరిని కంటతడి పెట్టిస్తోది.


‘‘నేనే అబ్బాయిని అయితే.. రూమ్ డోర్లు తెరిచే పడుకోవచ్చు..


నేనే అబ్బాయిని అయితే.. స్వేచ్ఛగా పరిగెత్తవచ్చు..


రాత్రంతా ఫ్రెండ్స్ తో కలిసి నిర్భయంగా తిరగవచ్చు.


ఆడపిల్లలను చదివించాలని.. బలంగా తీర్చిదిద్దాలని చెప్తారు..


కష్టపడి చదివి డాక్టర్‌ అయినా కంటిరెప్పలా కాపాడాడుకోవాల్సి వస్తోంది..


 --


ఈ రోజు నాపై దారుణ బలాత్కారం జరిగింది.


ఓ దుర్మార్గుడి దారుణాన్ని చూస్తూ ఉండిపోయా..


సీసీటీవీ లేకపోయి ఉంటే ఏం జరిగినా తెలిసేది కాదు..


పురుష సిబ్బంది ఉన్నా మాకు రక్షణ ఏది?


అందుకే.. నేనే అబ్బాయిని అయితే బాగుండేది.


ఒకవేళ నేనూ అబ్బాయిని అయి ఉంటే ఈ రోజు బతికి ఉండేదాన్నే” అంటూ బాధితురాలి బాధను చెప్పే ప్రయత్నం చేశారు నటుడు ఆయుష్మాన్ ఖురానా.





ఆయుష్మాన్ షేర్ చేసిన ఈ కవిత నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.  ఇది చూసిన ప్రతి ఒక్కరు కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. మనసుని తాకేలా ఉన్న ఈ కవిత చదివి ప్రతి ఒక్కరు ఆమెకు ఆశ్రు నివాళి అర్పిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఏమాత్రం మానవత్వం లేదంటూ మండిపడుతున్నారు. ఈ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు.  ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా స్పందించారు. స్ట్రాంగ్ మెసేజ్ అంటూ ఆయన కామెంట్ పెట్టారు. 


కోల్ కతా ఘటనపై స్పందించిన ఉపాసన


డాక్టర్ పై జరిగిన దారుణాన్ని తలచుకుంటేనే గుండె పగిలిపోతుందన్నారు ఉపాసన. ఆమె లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదన్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. ఎలా స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకుంటున్నామో అర్థం కావట్లేదన్నారు. దేశంలో హెల్త్ కేర్ రంగానికి వెన్నెముకగా ఉన్న మహిళలపై ఇలాంటి అమానుషం జరగడం దారుణం అన్నారు. ఇప్పటికైనా మహిళా భద్రతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందన్నారు. ప్రతి మహిళకు గౌరవం లభించాలని ఆమె ఆకాంక్షించారు.  అటు ఈ ఘటన సంబంధించి ఇప్పటికే ఒక నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.



Read Also: ఇదేం ఇండిపెండెన్స్ డే, కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార ఘటనపై ఉపాసనా సెన్సేషనల్ పోస్ట్