‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way Of Water) మూవీ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, రష్యాలో మాత్రం ఈ మూవీని రిలీజ్ చేయలేదు. ‘అవతార్-2’ను రష్యాలోకి డబ్బింగ్ చేసినప్పటికీ.. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఆ మూవీని అక్కడ రిలీజ్ చేయకూడదని డిస్నీ సంస్థ నిర్ణయించుకుంది. అయితే, డిస్నీ తీసుకున్న నిర్ణయం రష్యాకు అస్సలు నచ్చలేదు. దీంతో అక్కడి పాలకులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏకంగా పైరసీని ప్రోత్సహించేలా చట్టంలో మార్పులు చేసినట్లు సమాచారం. 
 
డిస్నీ ఈ మూవీ రిలీజ్‌ను వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఆ మూవీ పైరేటెడ్ వెర్షన్‌లను చట్టబద్దం చేయాలని రష్యా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే, డిస్నీ అధికారికంగా అక్కడ మూవీని రిలీజ్ చేయకపోయినా.. అక్రమ మార్గంలో ఆ మూవీని థియేటర్లలో విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే. ఈ నేపథ్యంలో ఆ మూవీ ప్రదర్శనతో వచ్చే ఆదాయం ఏదీ ‘అవతార్-2’ నిర్మాతలకు దక్కదు. ఒక విధంగా ఇది డిస్నీకి పెద్ద షాకే. 


ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో చాలా దేశాలు రష్యాతో సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలకు చెందిన దిగ్గజ కార్పొరేట్ సంస్థలు సైతం రష్యాలో తమ వాణిజ్య సంబంధాలను వదులుకోడానికి సిద్ధమయ్యాయి. వాటిలో డిస్నీ సంస్థ కూడా ఒకటి. అందుకే, ‘అవతార్-2’ను అక్కడ విడుదల చేయలేదు. వాస్తవానికి పైరేటెడ్ వెర్షన్లు ప్రదర్శిస్తే డిస్నీ వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవచ్చు. అయితే, రష్యా ప్రభుత్వమే స్వయంగా పైరేటెడ్ వెర్షన్లు ప్రదర్శించేందుకు వీలుగా చట్టాన్ని సవరిస్తే.. నిర్మాతలు చేతులెత్తేయాల్సిందేనా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే, ‘అవతార్-2’ నిర్మాతలు దీనిపై సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. రష్యాలో అలాంటి చట్టం చేసి.. తమ చిత్రాన్ని ప్రదర్శిస్తే ఏం చేయాలనే యోచనలో ఉంది. రిలీజ్ హడావిడి ముగియగానే ఈ విషయంపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.


రష్యాకు పైరేటెడ్ వెర్షన్ ఎలా చేరుతాయి?


అసలు ఆ దేశంలో ఆ మూవీని విడుదలే చేయకపోతే పైరేటెడ్ వెర్షన్ ఎలా చేరుతుందనే సందేహం కలగకమానదు. అయితే, రష్యాకు ఆ వెర్షన్‌లు అందించేది యూరోపియన్ దేశాలే. రష్యన్ వార్తా సంస్థ Izvestia ప్రకారం.. కొన్ని యూరోపియన్ దేశాలు రష్యా థియేటర్ యజమానులకు అక్రమ మార్గంలో పైరసీ కాపీలను విక్రయిస్తుంటాయి. మూవీ పిక్చర్ క్వాలిటీ ఆధారంగా $790 (రూ.65,428) నుంచి $15,820 (రూ.1,310,221) వరకు ధర చెల్లించి పైరేటెడ్ వెర్షన్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రష్యా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహాయంతో సినిమాల పైరేటెడ్ కాపీలను ప్రదర్శించడాన్ని వీలుగా చట్టంలో సవరణలు చేయాలనే యోచనలో ఉంది. అది అమల్లోకి వస్తే.. ఇకపై హాలీవుడ్‌ మూవీస్ కోసం అక్కడి నిర్మాణ సంస్థలను సంప్రదించకుండానే యురోపియన్ దేశాల నుంచి పైరేటెడ్ మూవీస్ కొనుగోలు చేసి రష్యాలో ప్రదర్శించుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ పైరేటేడ్ వెర్షన్ ప్రదర్శిస్తున్నారా, లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 


Also Read: 'అవతార్ 2' రివ్యూ : జేమ్స్ కామెరూన్ డిజప్పాయింట్ చేశాడా? వావ్ అనిపించాడా?