AR Rahman wife saira Banu announces separation | ప్రముఖ సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ వైవాహిక జీవితంలో టఫ్ ఫేజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రెహమాన్, ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రెహమాన్ నుంచి తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సైరా బాను తెలిపారు. ఎంతో బాధతో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ కష్ట సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు అని సైరా బాను చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.
లాయర్ ద్వారా ప్రకటన చేయించిన సైరా బాను
29 ఏళ్ల వైవాహిక బంధానికి రెహమాన్, సైరా బాను దంపతులు స్వస్తి పలికారు. గతంలో ఎంతో మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకోగా, తాజాగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత రహమాన్ తన భార్య నుంచి విడిపోతున్నారు. వీరి విడాకులకు సంబంధించి సైరా బాను తరఫున లాయర్ వందనా షా అధికారిక ప్రకటన చేశారు. ఇక వీరి దారులు వేరు, రెహమాన్, సైరా బాను విడాకులు తీసుకున్నారు అని లాయర్ ఓ ప్రకటనలో తెలిపారు.
సైరా బాను కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది. రెహమాన్, సైరా బానులు 1995లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సంతానం ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమన్ ఉన్నారు. కుమారుడు అమన్ రెహమాన్ పుట్టిన రోజైన జనవరి 6న పుట్టాడు. దాదాపు మూడు దశాబ్దాలు కలిసున్న ఈ జంట విడాకులకు వెళ్లడం రెహమాన్ అభిమానులను బాధిస్తోంది.
ప్రైవసీకి భంగం కలిగించొద్దు
‘ఎన్నో సంవత్సరాల వివాహ బంధానికి రెహమాన్, సైరాబాను స్వస్తి పలికారు. భర్త రెహమాన్ నుంచి విడిపోవాలని సైరాబాను నిర్ణయం తీసుకున్నారు. వారి బంధంలో కలతలు రావడంతో చాలా కష్టమైన నిర్ణయం సైరా బాను తీసుకున్నారు. వారి మధ్య ఎంతో అన్యోన్యత, ప్రేమ ఉన్నప్పటికీ వారి వివాహ బంధంలో ఎంతో ఒత్తిడి, కష్టాలు ఎదురవుతున్నాయి. దాంతో వీరి బంధం కొనసాగించాలని ఈ దంపతులు భావించడం లేదు’ అని సైరా బాను తరఫున లాయర్ కీలక ప్రకటన విడుదల చేశారు. ఎంతో బాధతో కూడిన నిర్ణయం సైరా బాను తీసుకున్నారని, తన జీవితంలో కష్టకాలం అని.. ఈ సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని ఆమె కోరుతున్నారని తెలిపారు.