హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ తన ఫోటోలను పెట్టి అలరించే అనుపమా, ఈసారి సామాజిక బాధ్యతను ప్రదర్శించింది. తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్టు చేసింది. నిజానికి ఆ పోస్టుకు ఎవరినీ ట్యాగ్ చేయలేదు. కానీ గుమ్మడి కాయల దొంగ అనగానే భుజాలు తడుముకున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వారు స్పందించారు. అనుపమా పోస్టులో చెత్తంత రోడ్డు మీద పడేసి ఉంది, అక్కడ ఆవులు చేరి తింటూ కనిపిస్తున్నాయి. ఆ ఫోటోలతో పాట ‘గుడ్’ మార్నింగ్ అనే క్యాప్షన్ పెట్టింది హీరోయిన్. ఆమె పోస్టు వైరల్‌గా మారడంతో జీహెచ్ఎంసీ ఖాతా నుంచి రిప్లయ్ వచ్చింది. ‘ఏ ప్రాంతంలో ఇలా ఉందో చెప్పండి, సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం’ అని రాశారు. దీనికి మళ్లీ అనుపమా ప్రతిస్పందించినట్టు కనిపించలేదు. ఆమె రిప్లయ్ ఇవ్వకపోవడానికి కారణం ఆ ఫోటోల్లోనే అడ్రెస్ కూడా ఉంది. అది కూడా అధికారులు చూసుకోకపోవడం గమనార్హం. 


ఆడేసుకుంటున్న నెటిజన్లు
అసలే రోడ్ల శుభ్రతపై అసంతృప్తిగా ఉన్న హైదరాబాదీలు జీహెచ్ఎంసీని ఆడేసుకున్నారు. ‘ఫోటోల్లోనే అడ్రస్ కూడా ఉన్నా... మళ్లీ ఎక్కడో చెప్పమని అడగడం ఏంటి?’ అని కొంతమంది విమర్శిస్తుంటే, మరికొందరు ‘హైదరాబాద్ లోని ప్రాంతాలు కూడా మీకు తెలియడం లేదా’ అని కామెంట్లు పెడుతున్నారు. అనుపమా పెట్టిన ట్వీట్ వల్ల జీహెచ్ఎంసీకి తలనొప్పిగా మారి, నెటిజన్లకు టార్గెట్ గా మారింది. 


మనసూ అందమైనదే...
షూటింగ్ చేసుకున్నామా, వెళ్లామా అన్నట్టు ఉండకుండా, సామాజిక బాధ్యతతో వ్యవహరించిన అనుపమాను మాత్రం నెటిజన్లు తెగ మెచ్చేసుకుంటున్నారు. ‘చూసి వదిలేయకుండా నలుగురికి తెలిసేలా చేశారు’ అంటూ మెచ్చుకుంటున్నారు. కొంతమంది తమ ప్రాంతాల్లోని చెత్త పేరుకపోయిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. మొత్తానికి అనుపమా పోస్టు హైదరాబాద్ లో వైరల్ గా మారింది.  



చాలా చిన్నవయసులోనే సినిమాల్లో అడుగుపెట్టింది అనుపమా పరమేశ్వరన్. 2015లో ప్రేమమ్ మూవీతో మలయాళంలో కెరీర్ మొదలుపెట్టింది. 2016లో తెలుగులోకికి ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది అఆ, ప్రేమమ్ సినిమాలు విడుదయల్యాయి. తరువాత శతమానం భవతి విడదులైంది. ఈ మూడు సూపర్ హిట్ కొట్టాయి. దీంతో సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది అనుపమా.