Weather Latest News: నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో బుధవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం లభించింది. ఈ నైరుతి రుతుప‌వ‌నాల ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాంలో మరో మూడు రోజుల పాటు వ‌ర్ష సూచ‌న ఉన్నట్లు అధికారులు ప్రక‌టించారు. 


దక్షిణ కోస్తా ఒడిశా, పరిసర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది.  రాగల రెండు రోజులలో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, తమిళనాడు, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి నైరుతి రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
నైరుతి రుతుపవనాల రాకతో మొదలైన వర్షాలతో ప్రజలకు ఉపశమనం కలిగింది. తొలకరి జల్లుల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు వాతావరణ కేంద్రం శుభవార్త అందించింది. కోస్తాంధ్ర జిల్లాల్లోకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రకాశం జిల్లా ఉత్తర భాగాలు, గుంటూరు జిల్లా మీదుగా విస్తరిస్తోంది. మరో నాలుగు గంటల్లో విజయవాడ జిల్లాతో పాటుగా ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అర్ధరాత్రి సమయం నుంచి విజయవాడ ఏలూరు జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. 


వచ్చే 3 గంటల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు, ఈదురు గాలులు
రాగల 3 గంటల్లో మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం ట్వీట్ చేసింది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని, ఈదురు గాలులు 30 కిలో మీటర్ల కన్నా ఎక్కువ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.






‘‘తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.