Annapurna Studios: సినిమా పరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇందులోకి అడుగు పెట్టేందుకు ఎంతో మంది యువతీయువకులు ప్రయత్నిస్తుంటారు. కొందరు నటీనటులుగా రాణించాలని అనుకుంటే, మరికొంత మంది రచయితలుగా సత్తా చాటుకోవాలి అనుకుంటారు. ఎలాగైనా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాలని నిర్మాణ సంస్థల కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. అలాంటి ఔత్సాహిక రచయితల కోసం అన్నపూర్ణ స్టూడియోస్ చక్కటి అవకాశం కల్పిస్తోంది. కథలు చెప్తే వినడానికి రెడీ అంటూ ఆఫర్ ఇస్తోంది.


రచయితలకు అన్నపూర్ణ స్టూడియోస్ ఆహ్వానం


సినిమా పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ ‘మీరు కథ చెప్తారా? మేం వింటాం!!’ అంటూ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేసింది. స్క్రిప్ట్‌ రైటింగ్‌ లో ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 3 నుంచి  ఫిబ్రవరి 9 వరకు అన్ లైన్ వేదికగా అప్లై చేసుకోవాలని తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చింది. ఆసక్తి ఉన్నవాళ్లు అందులో తమ పేరు నమోదు చేసుకోవాలని వెల్లడించింది. ఆ తర్వాత నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వారిని పిలిచి కథలు వినే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






అన్నపూర్ణ స్టూడియోస్ నిర్ణయంపై పట్ల రచయిత సంతోషం


సినీ నిర్మాణ రంగంలో ఎంతో అనుభవం ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ కొత్త రచయితలకు అవకాశం కల్పించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఎంతో మంది యువ రచయితలకు మేలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ అవకాశాన్ని వినయోగించుకోవాలని సినీ ప్రముఖులు సైతం సూచిస్తున్నారు. వాస్తవానికి  థీరిటికల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ, అది ప్రాక్టికల్‌గా ఏమంత ఉపకరించదంటున్నారు. కథలనేవి ఒక ఐడియాతో మొదలై రూపొందుతాయని, మంచి ఐడియాను ఎలా గ్రహించాలో, దాన్ని ప్రభావవంతమైన ఒక కథగా ఎలా మలచాలో, దానికి ప్రాణం ఎలా పోయాలో స్క్రిప్ట్‌ రైటింగ్ అనేది నేర్పిస్తుందన్నారు. మన పరిసరాల్ని ఎంత పరిశీలనా దృష్టితో చూస్తే, ఎంత సున్నితంగా మనం మారగలిగితే, ఒక శక్తిమంతమైన స్టోరీని నెరేట్ చేసే అవకాశం కలుగుతుందన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి సినీ నిర్మాణంలో  ఎంతో అనుభవం ఉన్న సంస్థ యువతకు అవకాశం కల్పించడం గొప్ప విషయం అంటున్నారు.



అన్నపూర్ణ స్టూడియోస్ ను స్థాపించిన అక్కినేని నాగేశ్వరరావు


ఇక అన్నపూర్ణ స్టూడియోస్ ను దివంగత ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు స్థాపించారు. సినీ పరిశ్రమని చెన్నై నుంచి నుంచి హైదరాబాద్ కు తరలించిన తర్వాత ఇక్కడ సినిమా వాళ్ళు ఇబ్బంది పడకూడదని భావించారు. సినిమా పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని, ఇక్కడే అన్ని నిర్మాణ పనులు జరగాలని అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించారు. ఆ తర్వాత దాన్ని నాగార్జున, అమల, సుప్రియ మరింత అభివృద్ధి చేశారు. అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ పెద్ద నిర్మాణగా ఎదిగింది. ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ కు అవకాశం కల్పించడంతో పాటు ఎంతో మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తోంది. 


Read Also: హీరోగా అజయ్ ఘోష్... యంగ్ హీరోయిన్ చాందినీ చౌదరితో సినిమా!