Jasprit Bumrah dedicates six wicket haul to his son:  వైజాగ్‌ టెస్ట్‌లో స్పిన్నర్లకు, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బుమ్రా చెలరేగిపోయాడు. బెన్‌ స్టోక్స్‌, ఓలీ పోప్, జో రూట్‌ వంటి టాప్‌ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. టెస్టుల్లో మరోసారి అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. భారత్‌ తరఫున వేగంగా 150+ వికెట్లు పడగొట్టిన పేసర్‌గా నిలిచాడు.  ఈ సందర్భంగా స్పెల్‌ను ఎవరికి అంకితం చేస్తారని బుమ్రాను ప్రశ్నించడంతో ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఈ స్పెల్ తన తనయుడికి అంకితం ఇస్తున్నానని చెప్పాడు. అతడితో కలిసి పర్యటించడం ఇదే తొలిసారి అని తెలిపాడు. టెస్టుల్లో తన వందో వికెట్ ఓలీ పోప్‌. 2021 పర్యటనలో ఓవల్‌ మైదానంలో అతడిని ఔట్‌ చేశానని,  ఇప్పుడు మరోసారి పోప్‌ను పెవిలియన్‌కు చేర్చానన్నాడు. 

 

ఓలి పోప్‌ గత మ్యాచ్‌లో కొంచెంలో డబుల్‌ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ మంచి టచ్‌లో కనిపించి మరోసారి మంచి ఇన్నింగ్స్‌ ఆడేలా కనిపించాడు. 23 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ను కాపాడేలా కనిపించిన పోప్‌ను.. బుమ్రా సూపర్‌ యార్కర్‌తో బౌల్డ్‌ చేశాడు. బుమ్రా సంధించిన యార్కర్‌కు పోప్‌ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ యార్కర్లలో ఒకటిగా ఇది నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అనంతరం 47 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ సారధి స్టోక్స్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్‌ చేశాడు. అద్భుతమైన బంతితో స్టోక్స్‌ను బౌల్డ్‌ చేశాడు. ఈ బంతిని అసలు ఎలా ఆడాలి అన్నట్లు బ్యాట్‌ కిందపడేసి స్టోక్స్‌ నిరాశ వ్యక్తం చేశాడు. చివరిగా అండర్సన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌కు బుమ్రా ముగింపు పలికాడు. మొత్తం ఆరు వికెట్లతో బుమ్రా బ్రిటీష్‌ జట్టు పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

 

అతి తక్కువ బంతుల్లో
వైజాగ్‌ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఓ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. మొత్తం 6,781 బంతులు వేసి, 150 వికెట్లు తీశాడు బుమ్రా. అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు తీసిన భారత బౌలర్లలో బుమ్రా తర్వాత వరుసగా ఉమేశ్ యాదవ్ (7661), మహ్మద్‌ షమీ (7755), కపిల్ దేవ్ (8378), రవిచంద్రన్‌ అశ్విన్ (8380) ఉన్నారు. మ్యాచుల పరంగా చూస్తే.. బుమ్రా 34 టెస్ట్ మ్యాచ్‌లలో 150 వికెట్లు పూర్తి చేశాడు.
మ్యాచ్‌ల పరంగా వేగంగా 150 టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లు
రవిచంద్రన్ అశ్విన్  29 మ్యాచ్‌లు 
రవీంద్ర జడేజా  32 మ్యాచ్‌లు 
ఎరపల్లి ప్రసన్న  34 మ్యాచ్‌లు 
అనిల్ కుంబ్లే –34 మ్యాచ్‌లు 
జస్ప్రీత్ బుమ్రా –34 మ్యాచ్‌లు 
హర్భజన్ సింగ్ –35 మ్యాచ్‌లు 
బీఎస్ చంద్రశేఖర్ –36 మ్యాచ్‌లు  



రెండో ఇన్నింగ్స్‌ కీలకం


వైజాగ్‌ టెస్ట్‌లో టీమిండియా(India) పట్టు బిగించే దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్‌(Yashasvi Jaiswal) డబుల్‌ సెంచరీతో 396 పరుగులు చేసిన రోహిత్ సేన... అనంతరం ఇంగ్లాండ్‌(England) జట్టును 253 పరుగులకే కుప్పకూల్చింది.  ఇక రెండవరోజు  భార‌త జ‌ట్టు భారీ ఆధిక్యం దిశ‌గా దూసుకెళ్తోంది. యువ‌కెర‌టం శుభ్‌మ‌న్ గిల్  హాఫ్ సెంచ‌రీ బాదడంతో ప‌టిష్ఠ స్థితిలో నిలిచిన టీమిండియా లంచ్ టైమ్‌కు 4 వికెట్ల న‌ష్టానికి 130 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతానికి రోహిత్ సేన‌ 273 ప‌రుగుల‌ ఆధిక్యంలో ఉంది. అక్ష‌ర్ ప‌టేల్క్రీ జులో ఉన్నాడు.