దర్శకుడు అనిల్ రావిపూడి చాలా కాలంగా బాలకృష్ణతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన 'ఎఫ్3' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది రిలీజ్ కాగానే బాలయ్య సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తారు. అయితే ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా కథను వెల్లడించారు. 

 

తండ్రి-కూతురు మధ్య నడిచే కథ అని.. తండ్రిగా బాలయ్య, కూతురిగా శ్రీలీల కనిపిస్తారని చెప్పారు. బాలయ్య ఇందులో కాస్త వయసుమళ్లిన వ్యక్తిగా కనిపిస్తారని.. సినిమా మొత్తం బాలయ్య క్యారెక్టరైజేషన్ మీదే నడుస్తుందని అన్నారు. 'పోకిరి', 'గబ్బర్ సింగ్', 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమాలు హీరోల పాత్ర చుట్టూ తిరుగుతాయని.. బాలయ్య సినిమాను కూడా అదే టెంప్లేట్ లో తీయాలని ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. 

 

50 ఏళ్ల వయసున్న ఓ తండ్రి పాత్ర ఎలా ప్రవర్తిస్తుందనేదే సినిమా కథ అని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు బాలయ్యను ఎవరూ ఈ కోణంలో చూపించలేదని.. తన మనసులో బాలయ్యను ఓ కొత్త కోణంలో చూస్తున్నానని.. కొత్తగా ప్రయత్నం చేస్తున్నానని అంటున్నారు అనిల్ రావిపూడి. సినిమా విడుదలైన తరువాత బాలయ్యను ఇలా కూడా చూపించొచ్చా అనేలా ఉంటుందని తెలిపారు. 

 

50 ఏళ్ల వ్యక్తి అంటే మాస్ ఎలిమెంట్స్ అవి ఉండవా..? అనే సందేహం వ్యక్తం చేయగా.. ఆయన స్టైల్, మాస్ లుక్, డైలాగ్స్ అన్నీ ఉంటాయని.. వీటితో పాటు తను అనుకుంటున్న కోణం కూడా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తన బ్రాండ్ ను పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో తన మార్క్ కామెడీ ఉండదని స్పష్టం చేశారు. పూర్తిగా తన ఇమేజ్ ను పక్కనపెట్టి, బాలయ్యతో ప్రయోగం చేస్తున్నానని తెలిపారు అనిల్ రావిపూడి.