ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల అధ్యక్షుడు ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు, సర్‌ప్రైజ్ చేసే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. లేటెస్టుగా ట్విట్టర్‌లో ఆయన ఒక పోల్ పెట్టారు. అందులో రెండు పేర్లు ఉన్నాయి. తన కొత్త కారుకు ఒక పేరును సూచించామని అడిగారు. అందులో మెజారిటీ ప్రేక్షకులు ఎన్టీఆర్ పేరుకు ఓటు వేశారు. అసలు, కారు ఏంటి? ఎన్టీఆర్ పేరు ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...
స్కార్పియో ఎన్ అందుకున్న ఆనంద్ మహీంద్రా
Anand Mahindra Gets His Scorpio-N : మహీంద్రా కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అందులోనూ స్కార్పియో చాలా మంది ఫేవరెట్ కార్. ఇరవై ఏళ్ళ క్రితం ఈ కారును లాంచ్ చేశారు. ఇప్పుడు స్కార్పియోలో థర్డ్ జనరేషన్ కార్ వచ్చింది. అదే 'స్కార్పియో ఎన్'. ఈ కారు శుక్రవారం ఆనంద్ మహీంద్రా చేతికి వచ్చింది. తన కారుకు పేరు పెట్టమని ట్విట్టర్‌లో నెటిజన్లను అడిగారు.
ఆనంద్ మహీంద్రా కారుకు చాలా మంది చాలా పేర్లు సూచించారు. అందులో రెండు పేర్లను ఆయన ఫైనలైజ్ చేశారు. ఒకటి... భీమ్! రెండు... బిచ్చు (అంటే తేలు అని అర్థం. స్కార్పియోకి హిందీ మీనింగ్). ఈ రెండు పేర్లలో ఒక పేరును ఫైనల్ చేయమని ట్విట్టర్ పోల్ పెట్టారు. మెజారిటీ ప్రేక్షకులు భీమ్ పేరుకు ఓటు వేశారు. ఆ పేరు ఫైనలైజ్ కావడం జస్ట్ ఫార్మాలిటీ అని చెప్పవచ్చు. పోల్ ఎండ్ అయిన తర్వాత భీమ్ పేరుకు ఎక్కువ ఓట్లు పడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
ఎన్టీఆర్ పేరూ ఒక బ్రాండ్!
ఇప్పుడు భీమ్ అంటే ప్రేక్షకులకు మాత్రమే కాదు, ప్రజలకూ గుర్తు వచ్చేది యంగ్ టైగర్ ఎన్టీఆర్. 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) సినిమాలో కొమురం భీమ్ పాత్రలో తారక్ నటన తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు, ఉత్తరాది ప్రజలను సైతం ఆకట్టుకుంది. అందుకు ఉదాహరణ... ఆనంద్ మహీంద్రా కారుకు చాలా మంది భీమ్ పేరును సూచించడం! నందమూరి తారక రామారావు జూనియర్ (NT Rama Rao Jr) పేరు మాత్రమే కాదు... సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు కూడా బ్రాండ్ అవుతోంది.
Also Read : Kantara in Telugu : తెలుగులో 'కాంతారా' - అల్లు అరవింద్ చేతిలో 'కెజియఫ్' నిర్మాత సినిమా
ఆనంద్ మహీంద్రా కొత్త కారుకు 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు భీమ్ ఫైనల్ కానుండటం నందమూరి అభిమానులు, తెలుగు ప్రేక్షకులకు ఎంతో సంతోషాన్ని కలిగించే అంశమని చెప్పవచ్చు.
'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత ఎన్టీఆర్ (NTR New Movie Update) కొత్త సినిమా ఏదీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. కనీసం కొత్త సినిమా కబురు చెప్పమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుతున్నారు. కొరటాల శివ, సానా బుచ్చిబాబుతో ఆయన సినిమాలు చేయనున్నారు. ఇక, ఎన్టీఆర్ ఆస్కార్ అందుకుంటే చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ నామినేషన్స్ దక్కాలని కోరుకుంటున్నారు.