ఈ మధ్యకాలంలో చాలా కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం సినిమాలను వాడేస్తున్నారు. తమ బ్రాండ్ నేమ్ జనాల్లోకి వెళ్లడం కోసం సినిమాలను మాధ్యమంగా ఎన్నుకుంటున్నారు. అమూల్ బ్రాండ్ కూడా ఇలానే చేస్తుంది. కొద్దిరోజుల క్రితం 'పుష్ప' సినిమా క్రేజ్ ని తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి వాడేసింది. 'పుష్ప' సినిమా మెయిన్ క్యారెక్టర్స్ తో ఓ కార్టూన్ డిజైన్ చేయించింది. కార్టూన్‌లో పుష్ప చేతిలో బ్రెడ్‌పై బటర్ ఉండే విధంగా తీర్చిదిద్దింది. ఆ రకంగా తమ బ్రాండ్ ను హైలైట్ చేసుకుంది.
ఇప్పుడేమో 'ఆర్ఆర్ఆర్' సినిమాను వాడేసింది. ఈ సినిమాలో 'నాటు నాటు' సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. నార్త్ కూడా ఈ సాంగ్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఆ సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ గెటప్ లను తీసుకొని కార్టూన్ డిజైన్ చేయించి.. 'TeRRRific Butter' అంటూ 'ఆర్ఆర్ఆర్'ని హైలైట్ చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కార్టూన్ చేతుల్లో బటర్ తో ఉన్న బ్రెడ్ ని పెట్టింది.
ఈ కార్టూన్ పై 'ఆర్ఆర్ఆర్' టీమ్ స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా 'ఆర్ఆర్ఆర్' మేనియానే. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ సినిమాను చూడడానికి థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. సెలబ్రిటీలు సైతం సినిమా చూసి ట్విట్టర్ వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. దాదాపు ఐదొందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడం ఖాయమని తెలుస్తోంది.