దివంగత కథానాయకుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. గత ఏడాది అక్టోబర్ 29న పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'పుష్ప: ద రైజ్' ప్రచార కార్యక్రమాల నిమిత్తం అల్లు అర్జున్ బెంగళూరు వెళ్లినప్పటికీ... సినిమా పనుల మధ్యలో రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను కలవాలని అనుకోలేదు. ఈ రోజు ప్రత్యేకంగా వాళ్లను పరామర్శించడం కోసం బెంగళూరు వెళ్లారు.


పునీత్ సోదరుడు, ప్రముఖ కన్నడ కథానాయకుడు శివ రాజ్ కుమాత్‌తో పాటు ఇతర కుటంబ సభ్యులను అల్లు అర్జున్ గురువారం కలిశారు. తొలుత శివ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లిన ఐకాన్ స్టార్, ఆ తర్వాత అక్కడ నుంచి కంఠీరవ స్టూడియోకు వెళ్లారు. పునీత్‌తో త‌న‌కున్న‌ అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం పాటు దివంగత కథానాయకుడికి నివాళులు అర్పించారు.


"నాకు పునీత్ ఎప్పటి నుంచో పరిచయం. ఆయన మా ఇంటికి వచ్చేవారు. భోజనం చేసేవాళ్ళం. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం. సడన్ గా ఆయన లేరు. నేను చాలా షాక్ అయ్యాను" అని గతంలో ఓసారి అల్లు అర్జున్ చెప్పారు.