పోలీసుల ఆంక్షలు ఛేదించుకొని విజయవాడ చేరుకున్న ఉద్యోగులు కచ్చితంగా సభ పెట్టి తీరుతామంటున్నారు. వివిధ జిల్లాల నుంచి మారువేషాల్లో చేరుకున్న ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
పోలీసుల కళ్లుగప్పి టూ వీలర్‌పై విజయవాడ చేరుకున్న సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి. అదే మాదిరిగా మిగతా పీఆర్సీ సాధన సమితి సభ్యులు కూడా విజయవాడ చేరుకున్నారు. ఈ ఉద్యమం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తుంది కాదని... తమ ఆవేదన చెప్పేందుకే చేస్తున్నామంటున్నారు ఉద్యోగులు
ఈ ఉద్యమం ఆగేది లేదని... కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేసే వరకు ఆగే ప్రసక్తి లేదంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వంతో చర్చలు తాము ఎప్పుడూ సిద్ధమేనని కానీ... తమ మూడు డిమాండ్లు నెరవేరిస్తే కూర్చొని మాట్లాడుకుందామంటున్నారు.
మరోవైపు బీఆర్‌టీఎస్ వేదికపైకి అనుమతించకపోవడంతో రహదారిపైనే బైఠాయించారు ఉద్యోగులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. విజయవాడ వచ్చిన వారిలో ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు కనిపిస్తున్నారు. జగన్‌గారూ... మేం మీ అక్కాచెల్లెళ్లమే అంటూ మహిళా ఉద్యోగుల నినాదాలు చేశారు. గోడు వినాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌టీఎస్ వద్దకు 13 జిల్లాల నుంచి వేలాదిగా చేరుకుంటున్నారు ఉద్యోగులు. పోలీసులు నిలువరించలేనంతగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు. బీఆర్‌టీఎస్ రోడ్డులో భారీగా సీసీ కెమెరాల ద్వారా పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు. అలంకార్ థియేటర్ నుంచి కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగుతోంది.
పిల్లలకే కాదు... ప్రభుత్వానికి కూడా పాఠాలు చెప్పమంటే చెబుతామంటున్నారు ఉపాధ్యాయులు. సలహాదారుల మాట పక్కనబెట్టి మా గోడు వినాలి సీఎం జగన్‌కు విన్నవించుకుంటున్నారు. మా గోడు వినండంటూ పాట పాడుతూ నిరసన తెలియ జేస్తున్నారు. ఫ్రెండ్లీ ప్రభుత్వమంటే స్మగ్లర్ల మాదిరిగా బస్సులు, రైళ్ల నుంచి దింపడమేనా? అంటు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పే స్లిప్పులన్నీ ఓ మాయాజాలం అంటూ మరికొందరు మండిపడుతున్నారు.
జిల్లాల నుంచి వస్తున్న ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేర్వేరు పనులపై ఊళ్లు వెళ్తున్న వారిని ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులపై తిరుగబడుతున్నారు.
కృష్ణాజిల్లా నందిగామ 65 వ నెంబరు జాతీయ రహదారిపై ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను అడ్డుకున్నారు పోలీసులు. వివిధ రకాల పద్ధతుల్లో వాహనాలలో ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘాలు చలో విజయవాడకు వెళుతున్నీరు. దీంతో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 45 మందిని అదుపులోకి 110 మందికి నోటీసులు అందజేశామనిసీఐ కనకారావు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.