ఏపీ పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఉద్యోగ సంఘాలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం కారణంగా విజయవాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల కళ్ళు గప్పి మరీ ఉద్యోగులు భారీ స్థాయిలో బెజవాడ చేరుకున్నారు.


ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉన్నా 9 గంటలకే ఉద్యోగులు BRTS రోడ్డు వద్దకు చేరుకున్నారు. ఏపీ ఎన్జీవో భవన్‌ నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు భారీ ర్యాలీ చేపట్టారు. వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాదయాత్రలో పాల్గొని ఉయ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేసారు.






ప్రభుత్వం హడావుడిగా ఇచ్చిన పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులు ధరించిన ఉద్యోగులు, తాము లేకుండా ప్రభుత్వం లేదంటూ నినాదాలు చేశారు. ఉద్యోగులను ఈ ప్రభుత్వం తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారనీ మండిపడ్డారు.


నేను ఉన్నాను... నేను విన్నానని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిన సీయం జగన్‌ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమవడం దారుణమని అన్నారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే ఉద్యోగులను రోడ్డుపైకి ఈడ్చారని ఆరోపించారు ఉద్యోగులు. అణచివేత కొనసాగితే ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు వెనుకాడమంటూ ఉద్యోగ సంఘాలు హెచ్చరించారు .






తాము ఏపీలో ఉన్నామని పాకిస్తాన్‌లో కాదన్నారు ఉద్యోగ సంఘాలు. ఉద్యోగుల జీవితంలో ఇది చీకటిరోజు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఉద్యోగులు.. బీఆర్‌టీఎస్ వేదికపైకి పోలీసులు అనుమతించకపోవడంతో రహదారిపైనే బైఠాయించారు. 


పోలీసులు సైతం ఈ ర్యాలీ విషయంలో కఠినంగా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి విజయవాడ వస్తున్న ఉద్యోగులను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి వస్తున్న ఉద్యోగులను వీరవల్లి వద్ద, నెల్లూరు వైపు నుంచి వస్తున్నా ఉద్యోగులను కృష్ణా కెనాల్ సమీపంలోనూ అడ్డుకున్నారు.


ట్రైన్ లో వస్తున్న ఉద్యోగులను కూడా రైల్వే స్టేషన్ లలో ఆపేశారు పోలీసులు. అయినప్పటికీ పోలీసుల కళ్లుగప్పి ఉద్యోగులు రకరకాలుగా పక్షవాతం పేషేంట్ ల రూపంలోనూ , భక్తుల రూపంలోనూ ప్రయాణం చేసి విజయవాడ చేరుకున్నారు.