కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. రాజకీయ నాయకుడిగానే కాదు, అల్లు అర్జున్ మామగా అందరికీ సుపరిచితం. అల్లుడు బన్నీ అంటే ఆయనకు చెప్పలేనంత ప్రేమ. తరచుగా అల్లుడిపై ప్రశంసలు కురిపిస్తుంటారు. బన్నీ కూడా సమయం దొరికినప్పుడల్లా తన మామ సొంతూరుకి వెళ్తుంటారు. అక్కడ అభిమానులతో కలిసి సరదాగా గడుపుతుంటారు.  బన్నీ లాంటి అల్లుడు దొరకడం ఎంతో గొప్ప విషయం అని చంద్రశేఖర్ రెడ్డి చాలా సార్లు చెప్పారు. దీన్ని బట్టి ఒకరంటే ఒకరికి ఎంత అభిమానమో అర్థం అవుతోంది. ఆయన కష్టాల్లో పాలుపంచుకోవడమే కాదు, విజయాలను దగ్గరుండి సెలబ్రేట్ చేసుకుంటారు చంద్రశేఖర్ రెడ్డి.


బన్నీకి పార్టీ ఇచ్చిన మామ


తాజాగా చంద్రశేఖర్ రెడ్డి తన అల్లుడికి మరోసారి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం 'పుష్ప:  ది రైజ్’ సినిమా అద్భుత విజయాన్ని అందుకోవడంతో అల్లుడికి అదిరిపోయే పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో సినిమా యూనిట్ తో పాటు పలువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్నీని ఘనంగా సత్కరించారు. ఆ పార్టీని మర్చిపోక ముందే తాజాగా మరోసారి కనీవినీ ఎరుగని దావత్ ఇచ్చారు చంద్రశేఖర్ రెడ్డి. ‘పుష్ప’ సినిమాలో నటనకు గాను బన్నీకి జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు దక్కింది. తాజాగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మ‌రోసారి పార్టీ ఇచ్చారు. అందరూ కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బన్నీకి బొకే ఇచ్చి పార్టీలోకి వెల్ కమ్ చెప్పారు.


పార్టీకి హాజరైన పలువురు ప్రముఖులు


ఈ పార్టీలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అల్లు అరవింద్, అల్లు శిరీష్ తో పాటు దర్శకుడు సుకుమార్, ‘పుష్ప’ చిత్రబృందం పాల్గొన్నది. అటు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. “జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సందర్భంగా అల్లు అర్జున్  మామగారు కె. చంద్రశేఖర్ రెడ్డి గారు  కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీలోని స్నేహితులకు పార్టీ ఇచ్చారు” అని వెల్లడించింది.


జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు


తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నటుడికి తొలిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఆగష్టు 24న బన్నీకి అవార్డును ప్రకటించగా, అక్టోబర్ 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ చిత్రంలో పుష్ప రాజ్ పాత్రకు ఆయన ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, ఫహద్ ఫాసిల్ , అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ ప్రతాప్ బండారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.


Read Also: ‘జవాన్‘ స్టైల్లో షారుఖ్ యాడ్ - రైల్లో బందీలుగా అలియా, రణబీర్ జంట!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial