టాలీవుడ్‌లో గత కొద్ది సంవత్సరాల నుంచి సిద్ శ్రీరామ్ హవా నడుస్తుంది. పుష్ప సినిమాలో తను పాడిన శ్రీవల్లి పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్ ఇంతకు ముందు నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో కూడా ‘సామజ వరగమన’ పాట మొదటి చార్ట్ బస్టర్‌గా నిలిచింది. తాము అనుకున్న దానికంటే ఈ పాట చాలా పెద్ద హిట్ అయిందని బన్నీ ఎన్నో సందర్భాల్లో చెప్పారు.
తనకు చార్ట్‌బస్టర్ సాంగ్స్ అందించిన సిద్ శ్రీరామ్‌ను అభినందిస్తూ అల్లు అర్జున్ ట్విట్టర్‌లో ప్రత్యేకంగా పోస్ట్ చేశాడు. ‘నా సోదరుడు సిద్ శ్రీరామ్ పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శ్రీవల్లి పాట పాడుతున్నాడు. మ్యూజిక్ స్టార్ట్ అవ్వకముందే తను పాట పాడటం ప్రారంభించాడు. ఆ తర్వాత మెల్లగా మ్యూజిక్ స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాను. కానీ మ్యూజిక్ స్టార్ట్ కాలేదు. తను మ్యూజిక్ లేకుండా పాడుతూనే ఉన్నాడు. నేను ఎంతో ఆశ్చర్యపోయాను. తన గొంతు చాలా మ్యాజికల్‌గా ఉంది. అప్పుడు నేను మనసులో అనుకున్నాను. తనకు సంగీతం అవసరం లేదు. తనే సంగీతం.’ అని ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ కింద సిద్ శ్రీరామ్ పాడిన వీడియోను కూడా బన్నీ అటాచ్ చేశాడు. దీనికి సిద్ శ్రీరామ్ కూడా స్పందించాడు.
2013లో మణిరత్నం సినిమా కడలిలోని ‘యాడికే’ సిద్ శ్రీరామ్ తొలి పాట. ఆ తర్వాత ఐ సినిమాలో నువ్వుంటే నా జతగా, సాహసం శ్వాసగా సాగిపోలో వెళ్లిపోమాకే పాటలతో సూపర్ హిట్లు కొట్టాడు. నాని హీరోగా నటించిన నిన్ను కోరిలో అడిగా అడిగా, గీత గోవిందంలో ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే పాటలు తనను సూపర్ స్టార్‌ను చేశాయి.
సిద్ శ్రీరామ్‌తో పాట పాడిస్తే కచ్చితంగా చార్ట్ బస్టర్ అనే స్థాయికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే సింగర్లలో సిద్ శ్రీరామ్ కూడా ఒకడు.