ప్రముఖ తెలుగు యూట్యూబర్, నటుడు అఖిల్ రాజ్ (Akhil Raj Uddemari) పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సముద్రంలో కళ్ళ ముందు చావును చూశారు. చావును తప్పించుకుని బయటకు వచ్చారు. అసలు వివరాల్లోకి వెళితే...


అఖిల్ రాజ్ గత నాలుగు రోజులుగా ఉత్తర కర్ణాటకలోని గోకర్ణ, మహాబలేశ్వరంలో ఉంటున్నారు. అక్కడ ఆలయంలోని భగవంతుడిని దర్శించుకున్నారు. గణపతి దేవుడ్ని కూడా దర్శించుకుని పూజలు చేశారు. ఆ తర్వాత కుడ్ల బీచ్ దగ్గరకు వెళ్లారు. సముద్రంలో ఎంజాయ్ చేస్తుండగా... అలలు ఆయన్ను లోపలకి లాక్కుని వెళ్లాయి. వెంటనే లైఫ్ గార్డ్స్, గోకర్ణలో ప్రజలు ఆయన్ను కాపాడి బయటకు తీసుకు వచ్చారు. 


''అఖిల్ రాజ్ కుడ్ల బీచ్‌లో ఈత కొడుతున్నారు. ఒక్కసారిగా ఆయన సముద్రం లోపలకు, నీటి కిందకు వెళ్లారు. అది గమనించిన లైఫ్ గార్డ్స్ వెంటనే నీటిలోకి దూకారు. మిస్టిక్ గోకర్ణ అడ్వెంచర్స్ టీమ్ కూడా జెట్ స్కీస్‌తో ఆ ప్రాంతానికి చేరుకుంది. అఖిల్ రాజ్‌ను కాపాడారు'' అని వినాయక్ శాస్త్రి అనే వ్యక్తి గోకర్ణలో మీడియాకు తెలిపారు. ఆయన ఇంట్లో అఖిల్ బస చేశారు. 


తనను కాపాడిన తర్వాత అఖిల్ రాజ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ''థాంక్ గాడ్. నాకు ఏమీ జరగలేదు. నీటి అడుగున చాలా డేంజరస్ గా ఉంది. నాకు ఈత వచ్చు. కానీ, నీటిలో అది హెల్ప్ కాలేదు'' అని అఖిల్ తెలిపారు. 


Also Read : 'రామ్ సేతు' రివ్యూ : అక్షయ్ కుమార్‌కు శ్రీరాముడు విజయాన్ని అందించాడా? సత్యదేవ్‌ ఎలా చేశారు?






హీరోగా ఓటీటీలోకి!
అఖిల్ రాజ్ హీరోగా నటించారు. ఆయన నటించిన 'విందు భోజనం' (Akhil Raj Vindhu Bhojanam Movied) సినిమా ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో కొన్ని రోజుల క్రితం విడుదలైంది. ఆ సినిమాకు వచ్చిన స్పందన తనకు సంతోషాన్ని ఇచ్చిందని ఒకసారి అఖిల్ రాజ్ తెలిపారు. 


అఖిల్ నటించిన ప్రాజెక్టుల విషయానికి వస్తే... దేత్తడి ఛానల్ అలేఖ్య హారిక ఉన్నారు కదా! ఆవిడతో 'ఏవండోయ్ ఓనర్ గారు' (Evandoi Owner Garu Akhil Raj) అనే యూట్యూబ్ సిరీస్ చేశారు. ప్రస్తుతం షీతల్ గౌతమ్, అఖిల్ రాజ్ జంటగా నటించిన 'సఖియా' అనే యూట్యూబ్ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది.  ఆల్రెడీ ఒక సిరీస్ వచ్చింది. ఇప్పుడు రెండో సీజన్ నడుస్తోంది. సినిమాల్లో అవకాశాల కోసం అఖిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. 






రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కొండా మురళి, సురేఖ దంపతుల జీవితాల్లో జరిగిన ఘటనల సమాహారంతో రూపొందిన సినిమా 'కొండా'. వరంగల్ లో ఒక ఈవెంట్ చేశారు. దానికి అఖిల్ రాజ్ యాంకర్ గా కూడా చేశారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారని, అవి విడుదల కావాల్సి ఉందని సమాచారం.