ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రం అభిమానులను అలరించడంలో విఫలం అయ్యింది. రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకులు అద్భుతంగా ఉంటుందని భావించారు. కానీ, ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి తీవ్ర నిరసనలను ఎదుర్కొంటుంది. పలువురు ఈ సినిమాపై విమర్శలు చేశారు. డైలాగ్స్‌ నుంచి వీఎఫ్‌ఎక్స్‌ వరకు అన్నింటిపైనా సినీ ప్రేక్షకుల నుంచి నెగిటివ్‌ రివ్యూలే ఇచ్చారు. ఇప్పటికే సినిమా ఆడక తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన మేకర్స్ కు సరికొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి.


జూలై 27న విచారణకు హాజరుకండి   


‘ఆదిపురుష్‌’ మూవీ మేకర్స్ జూలై 27న తమ ముందు హాజరుకావాలని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, ఈ సినిమాపై అభిప్రాయాలను తెలియజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్, జస్టిస్ ప్రకాష్ సింగ్‌ తో కూడిన వెకేషన్ బెంచ్, ఈ సినిమాపై నిషేధం విధించాలని కోరుతూ కుల్దీప్ తివారీ, నవీన్ ధావన్‌లు వేసిన వేర్వేరు పిటిషన్లను విచారించింది. దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్, డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అలాగే, సినిమాపై అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు, సినిమాకు సర్టిఫికెట్ మంజూరు నిర్ణయాన్ని సమీక్షించాల్సిందిగా సూచించింది. తాజా ఉత్తర్వులను హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. 


అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోం


సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చైర్మన్‌ తమ వ్యక్తిగత అఫిడవిట్‌లను దాఖలు చేయాలని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది.  పబ్లిక్ ఎగ్జిబిషన్ కోసం సినిమా సర్టిఫికేషన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను లేఖలో పాటించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించనున్నట్లు తెలిపింది. తదుపరి తేదీలోగా అవసరమైన అఫిడవిట్‌లను దాఖలు చేయని పక్షంలో, ఏ క్లాస్-1 అధికారి లేదంటే డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, సిబిఎఫ్‌సి తరఫున వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు తెలిపింది.  ‘ఆదిపురుష్’ దర్శకుడు, నిర్మాత, డైలాగ్ రైటర్ సినిమాకు సంబంధించిన వివరాలతో వ్యక్తిగత అఫిడవిట్‌లను దాఖలు చేయాలని ఆదేశించింది. అఫిడవిట్‌లపై వారి ప్రతిస్పందనకు ముందు మధ్యంతర ఉత్తర్వులు, బలవంతపు చర్యను ఆమోదించకుండా నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది.


‘ఆదిపురుష్’ను నిషేధించాలంటూ పలువురి డిమాండ్   


ఇప్పటికే ‘ఆదిపురుష్’ సినిమాను  బ్యాన్ చేయాలంటూ హిందూసేన ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కింది. ఈ మేరకు హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా పిల్ దాఖలు చేశారు.సినిమా ఇప్పటికే విడుదలైందని, ఈ విషయంలో తొందర అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.  ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఏకంగా ఈ సినిమాను నిషేధించడంతో పాటు చిత్ర నిర్మాతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. ఈ సినిమా హిందువులు, సనాతన ధర్మం, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వెల్లడించింది.


Read Also: అనూ ఇమ్మాన్యుయేల్‌‌కు, రెబా జాన్‌ ఏమవుతుంది? ‘సామాజవరగమన‘ బ్యూటీ క్లారిటీ


Join Us on Telegram: https://t.me/abpdesamofficial