PM Narendra Modi About 'Article 370' Movie: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం( ఫిబ్రవరి 20) నాడు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అటు మౌలానా ఆజాద్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా యామి గౌతమ్ తాజా మూవీ ‘ఆర్టికల్ 370’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
‘ఆర్టికల్ 370’పై ప్రధాని మోడీ ప్రశంసలు
జమ్మూ కాశ్మీర్ ప్రజలు అసలు వాస్తవాలను తెలుసుకునేందుకు ‘ఆర్టికల్ 370’ సినిమా బాగా ఉపయోగడుతుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. “ నాకు సినిమాల గురించి పెద్దగా తెలియదు. కానీ ‘ఆర్టికల్ 370’కి సంబంధించిన ఓ సినిమా ఈ వారంలో విడుదల అవుతుందని తెలిసింది. ప్రజలు జమ్ము కాశ్మీర్ లోని వాస్తవాలను తెలుసుకునేందుకు ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకాలం ఆర్టికల్ 370 జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి ఎంతో ఇబ్బందిగా ఉండేది. బీజేపీ అధికారంలోకి వచ్చాక, దాన్ని తొలగించడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడి ప్రజలు సామాజిక న్యాయాన్ని పొందుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు దశాబ్దాల తరబడి వారసత్వ రాజకీయాలను భరించాల్సి వచ్చింది. సదరు రాజకీయ నాయకులు వారి కుటుంబాల గురించి మాత్రమే ఆలోచించారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. గత 10 ఏళ్లలో ఈ ప్రాంతంలో 50 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశాం. అప్పట్లో ఇక్కడ స్కూళ్లు తగలబెట్టేవాళ్లు. ఇప్పుడు అలంకరిస్తున్నారు” అని చెప్పారు.
ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పిన యామీ గౌతమ్
ఇక తన సినిమాపై ఏకంగా ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించడంపై యామీ గౌతమ్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రధాని మోడీకి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు చెప్పింది. ప్రధాని మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. “చక్కటి కథతో ‘ఆర్టికల్ 370’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమాఅంచనాలను మించి ఉంటుందని నేను, నా టీమ్ భావిస్తున్నాం. మా సినిమా గురించి ప్రధాని మోడీ ప్రస్తావించడం నిజంగా సంతోషంగా ఉంది. ఆయనకు మా కృతజ్ఞతలు” అని యామీ వెల్లడించింది.
ఈ నెల 23న ‘ఆర్టికల్ 370’ మూవీ విడుదల
‘ఆర్టికల్ 370’ సినిమా ఆదిత్య సుహాస్ దర్శకత్వంలో తెరకెక్కింది. ‘ఆర్టికల్ 370’ ఎత్తివేతకు కారణాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారు. ‘ఆర్టికల్ 370’ రద్దుకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలను ఇందులో ప్రస్తావించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో యామీ గౌతమ్ పవర్ ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా కనిపించబోతోంది. పూర్తి స్థాయి యాక్షన్ అవతారంలో అలరించబోతోంది. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈనెల 23న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
Read Also: విలాసవంతమైన బంగళాలు, లగ్జరీ కార్లు - రకుల్, జాకీ ఆస్తుల విలువెంతో తెలుసా?