అచ్చ తెలుగమ్మాయిలా కనిపించే ఓ కన్నడ బ్యూటీ ‘అతిథి’ చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అందం, అభినయంతో అలరించింది. కానీ, అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. వచ్చినా పెద్దగా  గుర్తింపు తెచ్చుకోలేదు. సినిమాల కంటే ‘మీ టూ’ లాంటి వివాదాస్పద అంశాలతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ ఆమె ఎవరో మీకు ఓ ఐడియా వచ్చి ఉంటుంది. అవును. తనే మాధవీ లత.  


డిగ్రీ ఫోటోను షేర్ చేసిన మాధవీ లత!


తాజాగా  ఆమె ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది తను డిగ్రీలో ఉండగా తీసుకున్న దిగిన ఫోటో. “డిగ్రీ ఫైనల్ ఇయర్ లో హంపీ హిస్టరీ రిపోర్టుకు సంబంధించి సైట్ విజిట్ చేశాం. రాయల వారి హంపీ సామ్రాజ్యం అంతా తిరిగి తిరిగి పాయింట్స్ అన్ని రాసుకుని, ఎండకు ఎండి, ముఖాలు వాడిపోయి ఉన్నా, ఒక ఫోటో దిగాం. ఏది ఏమైనా అవి చాలా సంతోషకరమైన రోజులు. నేను ఎక్కడున్నానో గెస్ చేయండి” అంటూ మాధవీ లత రాసుకొచ్చింది.    






అతిథి’ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ


మాధవీ లత సినిమా పరిశ్రమలో చిన్న చిన్న పాత్రలు చేసింది.  2007లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘అతిథి’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఇందులో  హీరోయిన్ అమృతా రావు ఫ్రెండ్ గా కనిపించింది.  2008లో రవిబాబు దర్శకత్వం వహించిన ‘నచ్చావులే’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత నానితో కలిసి ‘స్నేహితుడా’ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటూ చదువుకుంది. 2013లో ‘అరవింద్ 2’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దివంగత నందమూరి తారకరత్నతో కలిసి ‘చూడాలని చెప్పాలని’ సినిమాలో నటించింది. ఇందులో మూగ, చెవిటి అమ్మాయిలా కనిపించింది. అయితే, ఈ సినిమా కొన్ని కారణాలతో రిలీజ్ కాలేదు. పలు సినిమాల్లో నటించిన ఆమెకు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. సినిమా పరిశ్రమలో ‘కమిట్మెంట్‘ వార్తలతో కొంత కాలం మీడియాలో బాగా పాపురల్ అయ్యింది.


రాజకీయాల్లో బిజీ అయిన మాధవి


ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది. రాజకీయాల్లో బిజీ అయ్యింది. 2018లో బీజేపీలో చేరింది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసింది. అయితే, ఈ ఎన్నికల్లో తను ఓటమి పాలయ్యింది. మాధవీ లత కర్ణాటక లోని బళ్ళారిలో 1988, అక్టోబరు 2న జన్మించింది.  బళ్ళారిలో డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకుంది. కన్నడ ఫ్యామిలీలో పుట్టినా, తెలుగు, తమిళ భాషలు చక్కగా మాట్లాడుతుంది.






Read Also: అలా మెరిసి, ఇలా మాయమయ్యారు - తొలి సినిమాతో మనసుదోచి కనుమరుగైన హీరోయిన్లు వీళ్లే