ప్రేమ... ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురై ఉంటుంది. అమ్మాయిలకు అయితే ప్రేమ ప్రపోజల్స్ ఎప్పుడో ఒక సమయంలో వచ్చి ఉంటాయి. నటి, 'బిగ్ బాస్ 3' ఫేమ్ హిమజ తనకు వచ్చిన ఫస్ట్ లవ్ ప్రపోజల్ గురించి ఓపెన్ అయ్యారు. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'టెన్త్ క్లాస్ డైరీస్' సినిమాలో ఆమె ఒక రోల్ చేశారు. మార్చి 4న సినిమా విడుదల కానుంది. బుధవారం సినిమా టీజర్ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో తనకు వచ్చిన లవ్ ప్రపోజల్ గురించి హిమజ చెప్పారు.
"నన్ను ఫస్ట్ ప్రపోజ్ చేసింది పదో తరగతిలోనే. అతను ఎక్కడ ఉన్నాడో, ఏమో నాకు తెలియదు కాబట్టి అతని పేరు నేను చెప్పను. అతనికి పెళ్లై ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయి. ఎప్పుడైనా మనల్ని ఒకరు ఇష్టపడటం అనేది చాలా స్పెషల్ మూమెంట్. అటువంటిది నాకు లవ్ లెటర్ వచ్చింది. పదో తరగతిలో నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. లవ్ లెటర్ ఇచ్చాడు. అది గుర్తు వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు దసరా రోజున ప్రపోజ్ చేశాడు. నాలాగా, చాలా మందికి పాజిటివ్ మెమరీస్ ఉంటాయి" అని హిమజ చెప్పుకొచ్చారు. "టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరి జీవితంలో చాలా స్పెషల్ మెమరీస్ ఉంటాయి. నాకు అయితే చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి" అని ఆమె తెలిపారు.
'టెన్త్ క్లాస్ డైరీస్' వంటి మంచి సినిమాలో తనకు మంచి రోల్ ఇచ్చినందుకు దర్శకుడు 'గరుడవేగ' అంజి, నిర్మాతలు అచ్యుత రామారావు, రవితేజ మన్యం, సమర్పకులు అజయ్ మైసూర్‌కు ఆమె థాంక్స్ చెప్పారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆల్మోస్ట్ సినిమా అంతా చూశానని, మార్చి 4న విడుదల అవుతున్న సినిమాను చూడమని ఆమె ప్రేక్షకులను కోరారు.
హిమజకు ప్రేమ, పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురు అవుతూ ఉంటాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో 'పెళ్లి ఎప్పుడు?' అనే ప్రశ్న ఆమె ఎదురైంది. "జీవితంలో పెళ్లి అనేది ఇంపార్టెంట్ ఆ? పెళ్లి లేకపోతేనే బావుంటుందని అనిపిస్తుంది" అని హిమజ సరదాగా అన్నారు. నటి అయిన తర్వాత కూడా ఆమెకు ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. మరి, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో? 'నేను శైలజ', 'శతమానం భవతి', 'చిత్రలహరి', 'ఉన్నది ఒకటే జిందగీ', 'వరుడు కావలెను' తదితర చిత్రాల్లో పాత్రలు నటిగా హిమజకు గుర్తింపు తెచ్చాయి.