Gayathri Varsha backs Minu Muneer: మలయాళీ సినిమా పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం రోజు రోజుకు మరింత ముదురుతోంది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు ఇచ్చిన తర్వాత పలువురు నటీమణులు బయటకు వచ్చి తమకు ఎదురైన వేధింపుల గురించి చెప్తున్నారు. అందులో భాగంగా పలువురు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తనను లైంగికంగా వేధించారంటూ మిను మునీర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. వారి వేధింపులు తట్టుకోలేక మలయాళీ సినీ పరిశ్రమనే వదిలి చెన్నైకి రావాల్చి వచ్చిందన్నారు.


మిను మునీర్ కు గాయత్రి వర్ష మద్దతు


మిను మునీర్ చేసిన ఆరోపణలకు మలయాళ నటి గాయత్రి వర్ష మద్దతుగా నిలిచారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, సినిమా సెట్ లో మణియం పిళ్ల రాజు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన తీరును తనతో చెప్పిందని వెల్లడించారు. ‘ద తడియా‘ సినిమా సెట్‌ లో మణియం పిళ్ల రాజు తలుపు తట్టినట్లు మిను తనతో చెప్పిందని గాయత్రి వర్ష చెప్పారు. అవకాశాలు కోల్పోతామనే భయంతో సినీ పరిశ్రమలో ఇలాంటి వ్యవహారాల గురించి బయటకు చెప్పడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరైనా మాట్లాడినప్పటికీ, చాలా తక్కువ మంది వారికి సపోర్టు చేస్తున్నారని వెల్లడించారు. తమకు ఎదురైన వేధింపుల గురించి ఎవరు ఫిర్యాదు చేసినా, చట్టపరమైన చర్యలు ఉండాలన్నారు. నిందితుల హోదాలతో సంబంధం లేకుండా యాక్షన్ ఉండాలన్నారు. ఇండస్ట్రీలోని కీచకులపై చర్యలు తీసుకుంటేనే మహిళలు రాణించగలుగుతారని గాయత్రి వర్ష చెప్పుకొచ్చారు.  


పలువురు ప్రముఖులపై మిను మునీర్ తీవ్ర ఆరోపణలు


రీసెంట్ గా మిను మునీర్ మలయాళీ నటులు ముఖేష్, జయసూర్యలపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనను లైంగిక వేధింపులకు గురించి చేశారంటూ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘డి ఇంగొట్టు నోక్కియే‘ సెట్‌ లో జయసూర్య తనతో అనుచితంగా ప్రవర్తించాడని వెల్లడించింది. టాయిలెట్ కు వెళ్లి వస్తుండగా, ఆయన వెనుక నుంచి వచ్చి కౌగిలించుకున్నాడని చెప్పింది. అనుమతి లేకుండానే ముద్దులు పెట్టాడని వెల్లడించింది. అటు ‘క్యాలెండర్‘ చిత్రీకరణ సమయంలో ఒక హోటల్‌లో ముఖేష్ తనను శారీరకంగా వేధించాడని ఆమె ఆరోపించింది. ముఖేష్ కు తాను సహకరించలేదనే కారణంతో AMMA సభ్యత్వం ఇవ్వకుండా చేశాడని వెల్లడించింది. మణియం పిళ్ల రాజుతో పాటు  ఇడవేల బాబు కూడా తనను లైంగికంగా వేధించారని మిను ఆరోపిచింది. ఆ సమయంలో తనతో ఉన్న గాయత్రి వర్షకు మణియం పిళ్ల రాజు వేధింపుల గురించి చెప్పింది. తాజాగా మిను తనకు ఎదురైన వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గాయత్రి మీడియా ముందుకు వచ్చింది. ఆమెకు వేధింపులు ఎదురైన మాట వాస్తవమేనని వెల్లడించింది.


ఇప్పటికే పలువురు నటీమణులు తమకు సినిమా పరిశ్రమలో ఎదురైన వేధింపుల గురించి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయ్ ప్రత్యేకంగా విచారణ సంస్థను ఏర్పాటు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.


Read Also: హేమ కమిటీ రిపోర్టు ఎఫెక్ట్‌ - తీవ్ర విమర్శలు, 'అమ్మా'కు మోహన్‌లాల్‌ రాజీనామా!