Sayaji Shinde About His Health: ప్రముఖ నటుడు షాయాజీ షిండే కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసింది. ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. తాజాగా ఆయన తన ఆరోగ్యం గురించి కీలక ప్రకటన చేశారు. ఈమేరకు ఇన్ స్టాలో వీడియో షేర్ చేశారు.
సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన షాయాజీ షిండే
ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని షాయాజీ షిండే తెలిపారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. “అందరికీ నమస్కారం. నటుడిగా నన్ను ఇష్టపడే వారికి, నేను హాస్పిటల్ లో చేరానని తెలుసుకుని నాకోసం ఆందోళన చెందిన వారికి ధన్యవాదాలు. మీ ప్రార్థనలు ఫలించి నేను కోలుకున్నాను. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ మీ ముందుకు వస్తాను. ప్రేక్షకులను మళ్లీ ఎంటర్ టైన్ చేస్తాను” అని చెప్పుకొచ్చారు. షాయాజీ షిండే వీడియో పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఈ నెల 11న ఛాతి నొప్పితో హాస్పిటల్ లో చేరిక
ఈ నెల 11న ఛాతీలో నొప్పి రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయను మహారాష్ట్ర సతారాలోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనను పరిశీలించి.. టెస్టుల అనంతరం గుండెలో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో యాంజియోప్లాస్టీ చేశారు. “షాయాజీ షిండే గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్ కు తీసుకురాగానే ఈసీజీ తీశాం. కొన్ని సమస్యలను గుర్తించాం. యాంజియోగ్రామ్ నిర్వహించిన తర్వాత గుండెలో కుడివైపు కొన్ని బ్లాక్స్ గుర్తించాం. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో యాంజియోప్లాస్టీ చేశాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించాం’’ అని డాక్టర్లు వెల్లడించారు.
తెలుగులో పలు సినిమాలు చేసిన షాయాజీ షిండే
షాయాజీ షిండే గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మహారాష్ట్రాలో పుట్టి పెరిగిన ఆయన ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. ‘సూరి’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టారు. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి హీరోగా నటించారు. ఆ తర్వాత ‘ఠాగూర్’లో విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో అవకాశం దక్కించుకున్న ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. షాయాజీ నటించిన ‘గుడుంబా శంకర్’, ఆంధ్రుడు, ‘సూపర్’, ‘అతడు’, ‘రాఖీ’, ‘పోకిరి’, ‘దుబాయ్ శీను’, ‘నేనింతే’, ‘కింగ్’, ‘అదుర్స్’ సహా పలు సినిమాలు ఆయనకు మంచి క్రేజ్ తెచ్చాయి.
Read Also: సల్మాన్ ఇంటి ముందు కలకలం - కాల్పులు జరిపిన దుండగులు