ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందిపడుతున్న ఓ నిరుపేద కుటుంబానికి హీరో సంపూర్ణేష్ బాబు ఆర్ధిక సాయం అందించారు. వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన సంకొజీ లావణ్య రమేష్ దంపతులకు శివ అనే రెండు నెలల బాబు ఉన్నాడు. నెల రోజులుగా ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు పరీక్షించగా.. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. 

 

వైద్యానికి రూ.10 లక్షలు ఖర్చవుతాయని డాక్టర్లు తెలిపారు. గ్రామస్తులు రూ.లక్ష విరాళం అందించగా.. సోషల్‌ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న హీరో సంపూర్ణేష్ బాబు శనివారం రామన్నపేటకు చేరుకొని చిన్నారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గుండె ఆపరేషన్ కు తన వంతుగా 25000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు సంపూర్ణేష్ బాబు. ఈ కార్యక్రమంలో మానేరు స్వచ్చంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్, రామన్నపేట, బండపల్లి గ్రామాల సర్పంచులు దుమ్ము అంజయ్య, న్యాత విజయజార్జ్‌ లు పాల్గొన్నారు. 

 

సంపూర్ణేష్ ఇలా ముందుకొచ్చి సాయమందించడంతో నెటిజన్లు ఆయన్ను కొనియాడుతున్నారు. గతంలో కూడా సంపూర్ణేష్ బాబు ఇలానే చాలా మందికి ఆర్ధిక సాయం అందించారు. వెంకటగిరి, స్రవంతి నగర్ లో యాక్సిడెంట్ లో తండ్రిని, కిడ్నీ వ్యాధితో తల్లిని కోల్పోయిన కీర్తన, అక్షయని కలిసి వారికి ఆర్థిక సహాయం చేసి వారి చదువు గురించి హామీ ఇచ్చారు సంపూర్ణేష్ బాబు. అలానే సినీ ఇండస్ట్రీకి కరోనా సమయంలో  విరాళం అందించారు. 

 

ఇక సినిమాల విషయానికొస్తే.. కామెడీ సబ్జెక్ట్ లతో ప్రేక్షకులను అలరించే సంపూర్ణేష్ బాబు ఈ మధ్యకాలంలో కాస్త జోరు తగ్గించారు. ప్రస్తుతం ఓ కొత్త సినిమాలు నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.