టాలీవుడ్ సినియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. కృష్ణ పార్థివదేహాన్ని సందర్శనార్థం పద్మాలయా స్టూడియోలో ఉంచారు. అనంతరం నేడు(బుధవారం) మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణ మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణ మరణంపై నటి శోభిత ధూళిపాల కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేసింది. "మా తెనాలి ప్రజలందరూ గర్వించేలా తెలుగు సినిమా పరిశ్రమను కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. మీరు మా అందరికీ స్ఫూర్తి దాయకులు. మీరు అసలైన true blue trendsetter! మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను" అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుగులో  కృష్ణకు నివాళులర్పించింది శోభిత.


కృష్ణ సొంత ఊరు గుంటూరు జిల్లా తెనాలి దగ్గర బుర్రిపాలెం గ్రామం. నటి శోభిత ధూళిపాల స్వగ్రామం కూడా గుంటూరు జిల్లాలోని తెనాలే. ఆమె పుట్టింది తెనాలిలో అయినా.. పెరిగింది మాత్రం విశాఖపట్నంలో. కానీ ఎవరికైనా పుట్టిన ఊరంటే కాస్త అభిమానం ఉంటుంది కదా. అందుకే తమ ప్రాంత ప్రజలు గర్వించేలా చేసిన సూపర్ స్టార్ కృష్ణకు ఆమె ఈ విధంగా నివాళులర్పించింది.


సూపర్ స్టార్ కృష్ణ సాధారణ వ్యక్తి గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అసాధారణ శక్తిగా ఎదిగి పుట్టిన ఊరు పేరును ప్రపంచానికి పరిచయం చేశారు. ఎంత ఎదిగినా పుట్టిన ఊరుని మాత్రం మరిచిపోలేదు ఆయన. తొలి చిత్రం తేనెమనసులు రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాను స్థానిక థియేటరులో బంధుమిత్రులు అందరితో  కలిసి చూశారు. చిన్నప్పటి స్నేహితులను కూడా మరవలేదు ఆయన. తన సినిమా విడుదల అయిన రోజు బుర్రిపాలెం వచ్చి తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకునేవారట.


తన  గ్రామంలో బీఈడీ కాలేజ్ శంకుస్థాపనకు, ఇంటర్నేషనల్‌ స్కూలు ప్రారంభానికి కూడా ఆయన హాజరయ్యారు. అలాగే అక్కడ హైస్కూలును అభివృద్ధి చేసి.. దానికి ఘట్టమనేని నాగరత్నమ్మ వీరరాఘవయ్య స్కూలుగా నామకరణం చేశారు. అలాగే ఆ గ్రామం లో షూటింగ్ లు కూడా చేసేవారు. ఆయన సహకారంతో ఆ గ్రామంలో ఎంతో మంది హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. చివరిసారిగా 2015లో సోదరుడి ఇంట వివాహ వేడుకకు సొంత ఊరు వచ్చారు కృష్ణ. తండ్రి స్పూర్తితో ఆ ఊరును మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.


ఇక శోభితా దూళిపాల 'మిస్ ఇండియా ఎర్త్' కిరీటం గెలిచిన తెలుగమ్మాయి. తెనాలిలో పుట్టి వైజాగ్ లో పెరిగిన శోభిత ‘రామన్ రాఘవ్ 2.0’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'గూఢచారి' చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమా మంచి సక్సెస్ రావడంతో నటిగా ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. తర్వాత 'మూతన్' 'ది బాడీ' 'చెఫ్' మూవీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో ‘మేజర్’ సినిమాలో కనిపించింది. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ లో కూడా నటించిన శోభిత.. వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.


Also Read : ఓ తరం వెళ్ళిపోయింది - ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ