యంగ్ హీరో కార్తికేయ రీసెంట్ గా తను ప్రేమించిన లోహితను వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ లో నవంబర్ 21న వీరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పాయల్ రాజ్ పుత్, తనికెళ్ల భరణి, సాయి కుమార్ లతో పాటు సినీ పెద్దలు అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి లాంటి ప్రముఖులు పెళ్లికి విచ్చేసి.. కొత్త దంపతులను దీవించారు. 

 


 

మెగాస్టార్ చిరంజీవితో కలిసి కార్తికేయ-లోహిత కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఫొటోలను షేర్ చేసిన కార్తికేయ.. ఓ ట్వీట్ చేశాడు. ''నేను పెద్దయ్యాక హీరో అవుతా.. అప్పుడు చిరంజీవి కూడా నా పెళ్లికి వస్తాడు'' అని చిన్నప్పుడు ఎంతో అమాయకంగా అనేవాడినని చెప్పాడు. ఇప్పుడు తను హీరో అయ్యానని అలానే చిరంజీవి తనను ఆశీర్వదించడానికి వచ్చారని.. ఆయనపై ఎప్పటినీ అంతులేని ప్రేమాభిమానాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. 

 

ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కెరీర్ విషయానికొస్తే.. 'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ.. ఆ తరువాత 'గుణ 369', 'చావు కబురు చల్లగా' వంటి సినిమాల్లో నటించాడు. హీరోగా అతడికి సరైన విజయాలు రావడం లేదు. రీసెంట్ గా 'రాజా విక్రమార్క' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఓ పక్క హీరోగా నటిస్తూనే.. మరోపక్క విలన్ రోల్స్ లో మెప్పిస్తున్నాడు కార్తికేయ. ప్రస్తుతం ఈ హీరో తమిళంలో 'వాలిమై' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన విలన్ గా కనిపించనున్నాడు.