కేంద్ర సమాచార, క్రీడా శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పర్యటనల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ చిరంజీవి, అల్లు అరవింద్, అక్కినేని నాగార్జునలతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత చలన చిత్ర పరిశ్రమ గురించి పలు విషయాలను చర్చించారు. ఈ భేటీకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. హైదరాబాద్ పర్యటనలో భాగంగా  కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తన నివాసానికి విచ్చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ సాధిస్తోన్న పురోగతి గురించి తన సోదరుడు నాగార్జునతో కలసి ఆయనతో చర్చించడం సంతోషంగా ఉందన్నారు. తమ కోసం సమయం కేటాయించినందుకు మంత్రి అనురాగ్‌కు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. "ప్రియమైన అనురాగ్ ఠాగుర్ కు ధన్యవాదాలు. నిన్న మీ హైదరాబాద్ పర్యటనలో నా దగ్గరికి రావడానికి సమయం కేటాయించినందుకు. నా సోదరుడితో నాగార్జునతో కలిసి భారతీయ చలనచిత్ర పరిశ్రమ, అది వేగవంతమైన పురోగతి గురించి చర్చించడం నచ్చింది" అని చిరంజీవి ట్వీట్ చేశారు.


అయితే మరోవైపు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవిని కలవడం వెనుక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి బీజేపీతో కలసి పనిచేయడానికి కేంద్ర మంత్రి ద్వారా ఆహ్వానించారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు బలం లేదనే వాదనలు కూడా లేకపోలేదు. మరోవైపు ఈ చర్చలో హీరో నాగార్జున కూడా ఉండటం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా నాగార్జున రాయకీయాలకు దూరంగా ఉంటారు. కానీ ఆయన మొదటినుంచీ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. గతంలో కూడా హీరో నాగార్జున ప్రధాన మోడీ ఒకరికొకరు ట్వీట్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 


అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పర్యటనలో భాగంగా చిరంజీవి నివాసానికి వచ్చినపుడు ఆ చర్చలో నాగార్జున కూడా ఉండటం చర్చనీయాంశమైంది. ఏదేమైనా కేంద్ర మంత్రి చిరంజీవి ఇంటికి వచ్చి సినిమా పరిశ్రమ గురించి చర్చించడం శుభపరిణామమే అంటున్నారు సినీ క్రిటిక్స్. అయితే ఈ చర్చలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు అనే విషయాలు ఏమీ బయటకు రాలేదు. అల్లు అరవింద్ మాత్రం ఫోటోలో కనిపిస్తున్నారు. మరి దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు చిరు. ఈ సినిమా జనవరి 13న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ సినిమాగా నిలిచింది. చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘వాల్తేరు వీరయ్య’ రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి 27 నుంచి ఈ మూవీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.