మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఏప్రిల్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఇప్పటివరకు విడుదలైన సినిమా ప్రచార చిత్రాలు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా 'సానా కష్టం' అనే ఐటెం సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఈ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇదొక ఐటెం సాంగ్.. ఈ సాంగ్ లో నటి రెజీనాతో కలిసి స్టెప్పులేస్తూ కనిపించారు చిరంజీవి. మణిశర్మ మాస్ బీట్ కి చిరు స్టెప్పులు అదిరిపోయాయి. ఇన్నేళ్లయినా మెగాస్టార్ లో ఆ గ్రేస్, స్టైల్ ఎంతమాత్రం తగ్గలేదు. 


భాస్కర్ భట్ల రాసిన ఈ పాటను రేవంత్, గీతా మాధురి ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. థియేటర్ లో ఈ పాటకు ఫ్యాన్స్ రచ్చ చేయడం ఖాయం. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావ‌డం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!