ప్రజలకు నగదు బదిలీ పథకాల ద్వారా డబ్బులు బదిలీ చేస్తున్నాం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు భిన్నంగా స్పందించారు. ఇప్పటికే రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని... రెండేళ్లలో పంచడానికి మరో రూ. లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. ఓటు  బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడానికి నియోజకవర్గానికి రూ. 1342 కోట్లు కేటాయిస్తున్నారని ..కానీ ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. రుణాలు వచ్చే మార్గాలన్నీ మూసుకుపోయాయన్నారు. అప్పులు తెచ్చి ఇక ఎంతో కాలం నగదు పంచలేరన్న విషయం ప్రజలకు అర్థమైపోయిందన్నారు. 



వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష స్థానమే బహుమతిగా లభిస్తుందని ఐవైఆర్ కృష్ణారావు జోస్యం చెప్పారు. 


 






ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మాజీ బ్యూరో క్రాట్లు కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం డబ్బులు పంచే పథకాలు అమలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఫలితంగా ఆర్థికాభివృద్ధి తగ్గిపోతోందన్నారు. ప్రజలపై పెద్ద ఎత్తున పన్నుల భారం పడుతోందని అదే సమయంలో.. ప్రభుత్వానికి అప్పులు పెరిగిపోయి.. ఆర్థికంగా దివాలా దీసే పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. నగదు బదిలీ పథకాల విషయంలో పునరాలోచన చేయాలని అంటున్నారు. 


అయితే సీఎం జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలవవడానికి నగదు బదిలీ పథకాలే ఆధారంగా భావిస్తున్నారు. ఎన్ని కోట్లు పంచాము.. ఎవరెవరికి పంచాము అన్న జాబితా దగ్గర పెట్టుకుని వారందర్నీ ఓటు బ్యాంక్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. లబ్దిదారుల జాబితాలతో ప్రతి ఒక్క వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరగాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.