ఆన్‌లైన్‌లో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్న అనసూయ. ఇటీవల ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
గత కొంత కాలంగా ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అనసూయ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
కోనసీమ జిల్లాలో నిందితుడి అరెస్ట్
ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఏపీలోని కోనసీమ జిల్లా పసలపూడికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజు ఈ అసభ్యకర పోస్టులు పెడుతున్నట్లు గుర్తించారు. ఫేక్ అకౌంట్స్ ద్వారా సినిమా హీరోయిన్లతో పాటు, యాంకర్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి షేర్ చేస్తున్నట్లు తేల్చారు. నిందితుడి ల్యాప్ టాప్ తో పాటు సెల్ ఫోన్ ను పోలీసులు హ్యాండోవర్ చేసుకున్నారు. అటు నిందితుడి ల్యాప్ టాప్ లో యాంకర్ అనసూయతో పాటు ఇతర యాంకర్లు రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, నటి ప్రగతి ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో చాలా ఫోటోలు మార్ఫింగ్ చేసి ఉన్నట్లు గుర్తించారు. వీరితో పాటు మరికొంత మంది హీరోయిన్లను, నటీమణులను, బుల్లితెర యాంకర్లను నిందితుడు టార్గెట్ చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. నిందితుడు ఎంత కాలంగా మార్ఫింగ్ ఫోటోలను నెట్టింట్లో పోస్టు చేస్తున్నాడు? అనే విషయంపైనా పోలీసులు ఆరా తీశారు. విచారణ అనంతరం నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. పోలీసులు నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టి జైలుకు పంపించారు.
సినిమాలపై ఫోకస్ పెట్టిన అనసూయ
ఇక అనసూయ తాజాగా అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ఫ’ సినిమాలో నటించింది. సునీల్ భార్య దాక్షాయని క్యారెక్టర్ లో ఒదిగిపోయింది. ప్రస్తుతం ‘పుష్ప-2’ సినిమాలోనూ నటిస్తోంది. ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం, విన్నర్, రంగస్థలం, కథనం, ఎఫ్-2, ఖిలాడి, దర్జా, వాంటెడ్ పండుగాడ్ సహా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ఓ రేంజిలో ఆకట్టుకుంది. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నది అనసూయ. ఈ షోల ద్వారా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. అటు పలు చానెల్స్ లోనూ యాంకర్ గా చేసి ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈమె సినిమాల మీద బాగా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ‘జబర్దస్’ షోకు గుడ్ బై చెప్పింది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.