టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో టీనా శిల్పరాజ్ హీరోయిన్ గా నటించారు. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ‘రైటర్ పద్మభూషణ్’ అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహార్ లు నిర్మించారు. 


ఫిబ్రవరి 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని కైవసం చేసుకుంది. సుహాస్ నటనతో పాటు కథ ప్రేక్షకులను కట్టిపడేసింది. చిన్న సినిమాగా రూపొందిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించిందని చెప్పొచ్చు. ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు ఉచితంగా చూసే విధంగా ఏర్పాట్లు చేశారు చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణవ్యాప్తంగా సుమారు 38 థియేటర్లలో ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఒక నెల ముందుగా ఫిబ్రవరి 8న ఈ ప్రత్యేక అవకాశం అందుబాటులోకి వచ్చింది. నిన్న ఒక్కరోజు సుమారు 33,136 మంది మహిళలు ఈ చిత్రాన్ని ఉచితంగా వీక్షించారు. టాలీవుడ్ చరిత్రలో ఇంతమంది మహిళలు ఒక సినిమాను థియేటర్లో ఫ్రీగా చూడటం ఇదే మొదటిసారి కావచ్చని అంటున్నారు. ఈ నేపత్యంలో ‘రైటర్ పద్మనాభం’ కొత్త రికార్డును సొంతం చేసుకున్నట్లే. 


యాంకర్ సుమ చేతుల మీదుగా టికెట్ ను లాంచ్ చేయించారు మేకర్స్. ‘ఉమెన్స్ వెన్స్‌డే’ అంటూ ఈ స్పెషల్‌ టికెట్‌ను లాంచ్ చేశారు.  ఈ షోలు మహిళలకు మాత్రమే ఉచితం కావడంతో వారితో వచ్చే పురుషులు టిక్కెట్లు కొనవలసి వస్తుంది. ఓవర్సీస్ లోనూ సినిమా దుమ్ము లేపేస్తోంది. మేకర్స్ తీసుకువచ్చిన ఈ ఆఫర్ వల్ల బాక్సాఫీస్‌కు కూడా ప్లస్ అయినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో వచ్చి తమ షోను చూసి ఆశీర్వదించిన మహిళలకు మేకర్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 


కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిపోయారు. అంతేకాదు ఇటీవల విడుదలైన ‘హిట్ -2’ సినిమాలో సైకో కిల్లర్ పాత్రను పోషించాడు సుహాస్. అటు హీరోగానే కాదు ఇటు విలన్ గా కూడా తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. తాజాగా ‘రైటర్ పద్మభూషణ్ ’ మూవీతో కూడా ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు రైటర్ పద్మభూషణ్ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే మంచి రెస్పాన్స్ ను సొంత చేసుకుంది.


సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ట్రైలర్ ను చూసి చిత్ర బృందాన్ని అభినందించారు. ట్విట్టర్ వేదికగా ‘రైటర్ పద్మభూషణ్’ ట్రైలర్ లింక్ ను షేర్ చేస్తూ... మీరు ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారని చెబుతూ మూవీ నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలను ప్రశంసించారు. ‘రైటర్  పద్మభూషణ్’ క్లైమాక్స్, అమ్మ ప్రేమను చూపించిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దీంతో దర్శక నిర్మాతలపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు రూ.6 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు సినిమాలను ఎంతైనా ఆదరిస్తారని మరోసారి తెలుగు ప్రేక్షకులు నిరూపించారు.


Also Read : 'ఫర్జీ' రివ్యూ : 'ఫ్యామిలీ మ్యాన్' రేంజ్ లో ఉందా? విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్‌ల వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?