గతేడాది కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. అందులో సినీ రంగం కూడా ఒకటి. 2021 లో అయినా.. పరిస్థితులు చక్కబడతాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మొదటి రెండు, మూడు నెలలు బాగా గడిచాయి. ఆ తర్వాత సెకండ్ వేవ్ కారణంగా మరో దెబ్బ పడింది. ఏప్రిల్ లో మూసిన థియేటర్లు ఇప్పటికీ తెరుచుకోలేదు. ప్రభుత్వం నుండి పర్మిషన్స్ వచ్చినా.. థియేటర్లను తెరవలేని పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఆగస్టు వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. 



ఈ ఏడాది మొదటి రెండు, మూడు నెలల్లో అయితే థియేటర్లలో సినిమాలు బాగానే నడిచాయి. సంక్రాంతి సీజన్ లో థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. 'క్రాక్' సినిమా తొలి హిట్ నమోదు చేస్తే.. 'రెడ్' సినిమా ఓకే అనిపించింది. ఆ నెలలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. కానీ మిగిలినవేవీ తమ మార్క్ ను క్రియేట్ చేయలేకపోయాయి. ఫిబ్రవరి 4న వచ్చిన 'జాంబీ రెడ్డి' సినిమా మంచి వసూళ్లను సాధించింది. అదే నెలలో వచ్చిన 'ఉప్పెన' సినిమా వసూళ్లలో రికార్డులు సృష్టించింది. దాదాపు యాభై కోట్లు రాబట్టిన ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ హీరోగా మారాడు. ఫిబ్రవరి 19న విడుదలైన 'నాంది' సినిమాకి ప్రేక్షకాదరణ లభించింది. 



నితిన్ - చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ లో వచ్చిన 'చెక్' సినిమా నిరాశనే మిగిల్చింది. ఫిబ్రవరి నెలలో డజనుకు పైగా సినిమాలు విడుదలయ్యాయి. మార్చి నెలలో కూడా ఈ హంగామా కనిపించింది. మార్చి 11న శివరాత్రి సందర్భంగా.. 'గాలి సంపత్', 'శ్రీకారం', 'జాతి రత్నాలు' సినిమాలు విడుదలయ్యాయాయి. వీటిల్లో 'జాతిరత్నాలు' సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇదే నెలలో వచ్చిన 'రంగ్ దే'కి ఏవరేజ్ టాక్ వచ్చింది. 'మోసగాళ్లు', 'చావు కబురు చల్లగా' లాంటి సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. 



ఏప్రిల్ నెలలో 'వైల్డ్ డాగ్' సినిమాతో థియేటర్లోకి వచ్చాడు నాగార్జున. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక ఏప్రిల్ 9న విడుదలైన 'వకీల్ సాబ్' ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించి తన సత్తా చాటింది. ఈ సినిమా విడుదలైన తరువాత కరోనా ప్రభావం పెరగడంతో మళ్లీ థియేటర్లకు తాళం వేయాల్సిన పరిస్థితి కలిగింది. అప్పటినుండి ఇప్పటివరకు థియేటర్లో సరైన సినిమా ఏదీ రాలేదు. 



థియేటర్లు మూసేసరికి చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. చిన్న సినిమాలు చాలా వరకు ఓటీటీలో వచ్చేశాయి. వీటిల్లో 'సినిమా బండి', 'ఏక్ మినీ కథ' లాంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జీ5 లో వచ్చిన 'బట్టల రామ స్వామి బయోపిక్'ని ప్రేక్షకులు ఆదరించారు. ఇవి మినహాయిస్తే.. ఓటీటీలో సక్సెస్ అయిన సినిమాలేవీ పెద్దగా లేవు. థియేటర్లు తెరుచుకొని కనీసం రెండో అర్ధభాగమైనా.. టాలీవుడ్ కి కలిసొస్తుందేమో చూడాలి!