Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం.19 జిల్లాల్లో వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. మొత్తం కలిపి వైకాపా సింగిల్ డిజిట్ విజయాలకే పరిమితమయ్యేలా ఉంది.
ఏపీలో వైకాపా భారీ ఓటమి చవి చూస్తోంది. ఇప్పటి వరకూ కేవలం ఎనిమిది స్థానాల్లో గెలిచిన వైకాపా మరో రెండు స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో కొనసాగుతోంది. మరోవైపు తెదేపా కూటమి ఇప్పటికే 155 స్థానాల్లో గెలుపొందగా.. మరో పది స్థానాల్లో లీడ్ లో ఉంది.
వైఎస్ ఆర్ జిల్లాకు చెందిన పులివెందుల నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ తన సమీప తెదేపా అభ్యర్థి బీటెక్ రవిపై 61,687 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.
ఇదే జిల్లాకు చెందిన బద్వేలు నియోజక వర్గంలో వైకాపా అభ్యర్థి దాసరి సుధ 18,567 మెజారిటీతో సమీప భాజపా అభ్యర్థి బొజ్జా రోషణ్ణపై గెలుపొందారు.
అలాగే అన్నమయ్య, వైఎస్ ఆర్ జిల్లాల ఉమ్మడి నియోజకవర్గం రాజంపేటలో సైతం వైకాపా అభ్యర్థి ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి తన సమీప తెదేపా అభ్యర్థి అయిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యంపై 7,016 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అన్నమయ్య జిల్లాకు చెందిన తంబళ్లపల్లిలో వైకాపా అభ్యర్థి ద్వారకానాథ్ రెడ్డి సమీప తెదేపా అభ్యర్థి జయచంద్రారెడ్డిపై దాదాపు పది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డి తన సమీప తెదేపా అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డిపై దాదాపు 12 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఇదే జిల్లాకు చెందిన అలూరు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి బి విరూపాక్షి తన సమీప తెదేపా అభ్యర్థి వీర భద్ర గౌడ్ పై దాదాపు మూడు వేల ఓట్లతో గెలుపొందారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తన సమీప తెదేపా అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై దాదాపే 6500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో మత్స్యరస విశ్వేశ్వర రాజు తన సమీప అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై సుమారు 19 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఇదే జిల్లాలోని అరకు వ్యాలీ నియోజకవర్గంలో రేగం మత్యలింగం తన సమీప భాజపా అభ్యర్థి పంగి రాాజారావుపై దాదాపు 32 వేల ఒట్ల మెజారిటీతో గెలుపొందారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ తన సమీప తెలుగు దేశం పార్టీ అభ్యర్థి ఎరిక్సన్ బాబుపై 1200 ఓట్ల మెజారిటీ కనబరుస్తున్నారు.
ఇదే జిల్లాకు చెందిన గిద్దలూరు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి తెదేపాకు చెందిన తన సమీప అభ్యర్థి అశోక్ రెడ్డిపై 400 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.
వైకాపా ఇప్పటికైతే తొమ్మిది స్థానాల్లో గెలిచి రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఎర్రగొండపాలెం, గిద్దలూరుల్లో వైకాపా అభ్యర్థులకు 1200, 400 ఓట్ల మెజారిటీ మాత్రమే ఉండటంతో వైకాపా సింగిల్ డిజిట్ విజయాలకే పరిమితమవుతుందా అనే సందేహం కలుగుతోంది.