Warangal Lok Sabha Elections 2024: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు హోరా హోరీగా జరిగినప్పటికీ ఫలితాలు మాత్రం వన్ సైడ్ అయ్యాయి. కౌంటింగ్ ప్రారంభం నుండి చివరి వరకు కాంగ్రెస్ అభ్యర్థులు రౌండ్ రౌండ్ కు మెజార్టీని కొనసాగించారు. వరంగల్, మహబూబాబాద్  పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని అనుకున్న ఎవ్వరు ఊహించని స్థాయిలో మెజార్టీ రావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.


బలరాం నాయక్ గెలుపు
20 రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ హవా ముందు బిజేపి వాడిపోగా.. కారు కదలలేక పోయింది. వరంగల్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ తో ప్రారంభమైన మెజార్టీ ప్రతి రౌండ్ కు మెజార్టీ పెరుగుతూ చివరి రౌండ్ వరకు కొనసాగింది. వరంగల్ పార్లమెంటు లో బిజేపి రెండవ స్థానానికి నిలవగా, బీ అర్ ఎస్ మూడవ స్థానానికి పరిమితమైంది. మహబూబాబాద్ లో బీ అర్ ఎస్ రెండవ స్థానంలో ఉండగా బిజేపి మూడవ స్థానానికి వెళ్ళింది. గెలుపు పై ధీమాతో ఉన్న కడియం కావ్య కౌంటింగ్ సెంటర్ కు ఆలస్యంగా వచ్చింది. 


ఆశ్చర్యానికి గురిచేసిన భారీ మెజార్టీలు..
మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో ప్రధానంగా కాంగ్రెస్, బీఅర్ఎస్, బీజేపీ అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇక్కడ కాంగ్రెస్, బీఅర్ఎస్ మధ్య ద్విముఖ పోరు ఉంటుందని అనుకున్న కాంగ్రెస్ విజయం ఖాయమనుకున్నారు. కానీ ఈ రోజు ఫలితాల్లో పెద్ద సంఖ్యలో మెజార్టీ వస్తుందని ఎవరు ఊహించలేదు. ఎవరు గెలిచినా లక్ష లోపు మెజార్టీతో గెలుస్తారు అనుకున్నారు. కానీ అంచనాలకు మించి 3 లక్షల 49 వేల 165  మెజార్టీ తో సమీప బీ అర్ ఎస్ అభ్యర్థి మాలోతు కవిత పై కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పవచ్చు. 


అదే కారణమా?
మహబూబాబాద్ పార్లమెంట్లో పరిధిలో ఏడుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలంగా ఉండడం ఒక కారణమైతే. మరో కారణం బీ అర్ ఎస్ పార్టీ పై ఉన్న వ్యతిరేకతకు తోడు బిజేపి అభ్యర్థి బలమైన అభ్యర్తికకపోవడంతో పాటు బిజేపి పార్టీ సైతం బలంగా లేదు. దీంతో నేడు వెలువడిన ఫలితాలతో ప్రజలు ఏక పక్షంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడంతో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3 లక్షల మెజార్టీ సాధించారు.


వరంగల్‌ లోనూ ఇంతే
ఇక వరంగల్ పార్లమెంట్ పరిధిలో కూడా ఊహకందని మెజార్టీని సాధించింది కడియం కావ్య. వరంగల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీఅర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఢీ అంటే ఢీ అనే విధంగా పోటీపడ్డారు. ఇక్కడ త్రిముఖ పోటి నెలకొన్న. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్లో ఎవరూ గెలిచిన 50 వేల లోపు మెజార్టీ వస్తుందని అంచన వేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ, ఆ అభ్యర్థి సైతం తక్కువ మెజార్టీ తో విజయం సాధిస్తామని అనుకున్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు వరంగల్ పార్లమెంటులో బీజేపీ గెలుస్తుందని చెప్పారు. 


కానీ అంచనాలు తారు మారై కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ఊహించని విధంగా 2 లక్షల 19 వేల 691 మెజార్టీతో సమీప బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పై విజయం సాధించింది. కడియం కావ్యకు బీజేపీ పార్టీ అభ్యర్థి పై ఉన్న వ్యతిరేకత, బీఅర్ఎస్ అధికారానికి దూరం కావడం కలిసివచ్చిన అంశాలుగా చెప్పవచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచిన వరంగల్ తీర్పు, పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో కూడా ఎంపీ వచ్చేసరికి ఓట్లు కాంగ్రెస్ కు మళ్ళాయి. ఏది ఏమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు స్థానాల్లో రికార్డ్ స్థాయీ మెజార్టీ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. 


2019, 2024 మెజార్టీలు ఇవీ


వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2019 పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 3 లక్షల 50 వేల 298 మెజార్టీ సాధించి రికార్డు సృష్టించగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2 లక్షల 19 వేల 691 మెజార్టీ సాధించింది.


మహబూబాబాద్ పార్లమెంట్...
2019 ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత లక్ష 46 వేల 600 మెజారిటీతో విజయం సాధించగా 2024లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ 3 లక్షల 49 వేల 165 మెజార్టీ సాధించి కవిత రికార్డులు బ్రేక్ చేశారు.