YSR CP MLA joined in Congress: రాష్ట్రంలో నాయకుల జంపింగులు కొనసాగుతున్నాయి. టికెట్ ఆశించిన వారు.. తమ తమ పార్టీలలో టికెట్ దక్కని అసంతృప్తులు వేరే పార్టీలవైపు దృష్టి సారించారు. ఈ క్రమంలో వారు పార్టీలు మారుతున్నారు. టికెట్‌పై హామీ ఇస్తే చాలు.. అన్నట్టుగా కొందరు నాయకులు జంప్ చేస్తుండడం గమనార్హం. తాజాగా అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP)కు చెందిన నేత, దళిత ఎమ్మెల్యే ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) నేతృత్వంలో ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. అయితే.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగడుతున్న ఆయన సోదరి, షర్మిల పార్టీ కాంగ్రెస్ గూటికి వైసీపీ ఎమ్మెల్యే చేరుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
ఆర్థర్.. అగచాట్లు..
నంద్యాల జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం నందికొట్కూరు(Nandi kotkuru) సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే(MLA) ఆర్థర్(Aurthor). 2019 ఎన్నికల్లో నందికొట్కూరు నుంచి వైఎస్సార్ సీపీ టికెట్‌పై విజయం దక్కించుకున్నారు. సీఎం జగన్‌కు అత్యంత అభిమానిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. జగన్‌కు వీర విధేయుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. సౌమ్యుడు, వినయశీలిగా నియోజకవర్గంలోనూ పేరు గడించారు. అయితే.. తొలి ఏడాది హుషారుగానే సాగిపోయినా.. తర్వాత.. ఈ నియోజక వర్గం ఇంచార్జ్‌గా యువ నాయకుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాదికార సంస్థ(శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చారు. ఇక, అప్పటి నుంచి ఆర్థర్‌కు అగచాట్లు ప్రారంభమయ్యాయని ఆయన అనుచరులు చెప్పేవారు. తన మాటకు విలువ లేకుండా పోయిందని అనేక సందర్భాల్లో ఆయన మొత్తుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న తనను ఎవరూ లెక్క చేయడం లేదని కూడా చెప్పేవారు. అనేక సార్లు ఇరువురి మధ్య పంచాయితీ కూడా సాగింది.
వేచి చూసి చివరికి నిర్ణయం..
ఇక, తాజా ఎన్నికల్లో అనేక సర్వేలు చేసిన సీఎం జగన్ పలువురు ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. ఇలానే.. నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్‌ను కూడా పక్కన పెట్టారు. అయితే, ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని.. పార్టీ తరఫున పనిచేయాలనిమాత్రం సీఎం జగన్ సూచించారు. ఈ క్రమంలో ఆర్ధర్‌కు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. ఇదే సమయంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సూచించిన డాక్టర్ సుధీర్‌కు టికెట్ ఇచ్చారు. దీంతో ఆర్థర్ చాలా రోజు వేచి చూసి షర్మిల నుంచి సమాచారం అందుకున్న తర్వాత.. తాజాగా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఆయనకు షర్మిల సాదర స్వాగతం పలికి.. పార్టీలోకి ఆహ్వానించారు.
టికెట్ ఈయనకే!
నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్‌కు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.ఇక, ఇక్కడ నుంచి వైఎస్సార్ సీపీ డాక్టర్ సుధీర్‌ను ఖరారు చేయగా తెలుగుదేశం-జనసేన మిత్రపక్షం తరఫున గిత్తా జయసూర్య బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం.. వైఎస్సార్ సీపీలో టికెట్ దక్కలేదన్న సానుభూతి ఉండడంతో ఆర్థర్‌కు గెలిచే స్థాయిలో ఓట్లు పడే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఒకవేళ ఓడినా.. అది ఓట్ల చీలికకు దారితీస్తుందని చెబుతున్నారు.