Sajjala Questions To Election Commission: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన రాజకీయంగానూ తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా, దీనిపై స్పందించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy).. ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారని చెబుతోన్న వీడియో నిజమైనదని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా.? అని ప్రశ్నించారు. వీడియో నిజమైనదో.? కాదో.? ఎలాంటి నిర్ధారణ చేయకుండానే ఈసీ ఎలా చర్యలకు దిగుతుంది.? అని అన్నారు. ఒకవేళ ఆ వీడియో నిజమైనదే అయితే సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది.? అనే సందేహం వెలిబుచ్చారు.


'ఆ వీడియోనే లీకైందా.?'


'మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు ఈవీఎంలకు సంబంధించి 7 ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.!. అలాంటప్పుడు కేవలం ఒక్క వీడియోని మాత్రమే ఎలా లీక్ చేస్తుంది. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలు, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించి ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదు.?. అన్నీ వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది. కానీ ఓ చిన్న క్లిప్పింగ్ మాత్రమనే బయటకు ఎలా వస్తుంది.? తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్న రెండు వీడియోలను పరిశీలిస్తే అమాయక ఓటర్లపై టీడీపీకి చెందిన వారు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వారిపై ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు.? దాని వెనుక ఉన్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదు.?' అని సజ్జల ప్రశ్నల వర్షం కురిపించారు.