Election Results 2024:  ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్‌సీపీకి అత్యంత ఘోరమైన ఓటమి ఖాయమయింది. ఉదయమే కౌంటింగ్  సెంటర్లకు వచ్చిన అభ్యర్థులు మొదటి రెండు, మూడు రౌండ్ల తర్వాత పరిస్థితి చూసి వెళ్లిపోయారు. మామూలుగా చివరి వరకూ ఉండి ఫలితం చూసి.. డిక్లరేషన్ ఫాం తీసుకుని వెళ్లాలి. కానీ ఏ రౌండ్‌లోనూ కనీసం గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో.. ఫలితం అర్థమైపోయి ఇంటి బాట పట్టారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు కొడాలి నాని, వల్లభనేని వంశీ నాలుగు రౌండ్ల తర్వాత గెలిచే అవకాశం లేకపోవడంతో ఇంటిబాట పట్టారు.     

  


రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి  ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ ఎంత భారీ విజయాన్ని సాధించిందో.. ఈ ళసారి అంత కంటే ఎక్కువగా ఘోర పరాజయం పాయింది. ఎక్కడా కూా గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో అభ్యర్థులు డీలా పడిపోయారు. మూడు రౌండ్ల తర్వాత వరుసగా కౌంటింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయారు. కౌంటింగ్ ఏజెంట్లు కూడా తర్వాత వెళ్లిపోవడంతో .. వైసీపీ తరపున ఓట్ల లెక్కింపును కూడా పర్యవేక్షించేవారు లేకపోయారు. 


ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వచ్చినా లోకల్ ఎగ్జిట్ పోల్స్.. బాగా వచ్చాయని పోటీ ఇచ్చే స్థాయిలో ఉంటామని వైసీపీ నేతలు అనుకున్నారు. అందుకే కాస్త గట్టిగా పోరాడి అయినా ఓట్లను తమకు అనుకూలంగా చేసుకునేందుకు ప్రయత్నించాలని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు కౌంటింగ్ ఏజెంట్లకు సలహా ఇచ్చారు.అయితే మొదటి రౌండ్లలోనే ఫలితం తేలిపోవడంతో.. వైసీపీ నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయింది.