YSRCP Comments On Pawan: జనసేన అధ్యక్షుడు అనే దాని కంటే ఆ పార్టీని టీడీపీలో విలీనం చేసి టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుందని పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. చంద్రబాబు ఇచ్చిన 24 సీట్లు తీసుకొని ఎవరి పై ఏం యుద్ధం చేస్తారని ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన సజ్జల చంద్రబాబు, పవన్‌పై విమర్శలు చేశారు. 


టీడీపీ, జనసేన మొదటి జాబితాపై మాట్లాడిన సజ్జల... వారి వద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదని ఏదోలా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆరాటమే కనిపిస్తోందన్నారు. ఈ ఎపిసోడ్‌లో పవన్ చూస్తే జాలేస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తే అవే తీసుకొని పార్టీ కేడర్‌కు, నమ్మకున్న లీడర్‌లకు అన్యాయం చేశారని ఆరోపించారు. 

పార్టీని నడిపే సత్తా పవన్‌కు లేదన్న సజ్జల... ఆయన చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియదని ఎద్దేవా చేశారు. చివరకు ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారో కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. ఓవైపు చంద్రబాబు మాత్రం పవన్‌ను ఆ పార్టీని మింగేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు సజ్జల. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేసినా తమకు మాత్రం 175 సీట్లు ఖాయమన్నారు. వైసీపీ విజయం గ్యారంటీ అన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల పొత్తుల్లో భాగంగా జనసేన 24 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయంచడంపై అధికార పక్షం నుంచి గట్టిగానే కౌంటర్‌లు వస్తున్నాయి. కనీసం పావలాకి కూడా పనికి రాడని తేల్చిన టీడీపీ 24 సీట్లు మాత్రమే ఇచ్చిందని సెటైర్లు పేల్చారు అంబటి రాంబాబు. ఛీ... పవన్ అంటూ ట్వీ చేస్తూ పల్లకి మోయడమే తప్ప పావలాకి కూడా పనికి రావాలని చంద్రబాబు తేల్చారంటూ విమర్శలు చేశారు.