Andhra Politics : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం వీడియో వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని వైసీపీ నేతలంతా వరుసగా డిమాండ్ చేస్తున్నారు. మమూలుగా మాచర్లలోని అన్ని పోలింగ్ బూత్‌లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ నెట్ వర్క్ అంతా ఈసీ వద్ద ఉంటుంది. అందుకే చాలా చోట్ల సీసీ కెమెరాల వైర్లు కత్తిరించారని ప్రచారం జరిగింది. కానీ పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన పోలింగ్ బూత్ లో వైర్ లెస్ కెమెరా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగా వైసీపీ నేతలు సీసీ కెమెరాను పట్టించుకోలేకపోయారు.
పదమూడో తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎం ధ్వంసంపై పిన్నెల్లిపై కేసు నమోదు చేయలేదు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి సాహసించలేదు. వీడియో దృశ్యాలు కూడా బయటకు రాలేదు. అయితే ఈసీ ఆదేశాల మేరకు ఏర్పాటు అయిన ప్రత్యేక దర్యాప్తు బృందం మాచర్లకు వచ్చి విచారణ జరిపింది. అక్కడ రిటర్నింగ్ అధికారులు ఈ దృశ్యాలను విచారణ బృందానికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఈ దృశ్యాలు చూసిన తర్వాత పిన్నెల్లిపై కేసు పెట్టారు. 20వ తేదీన రెంటచింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారని స్వయంగా సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
ఆ తర్వాత రెండు రోజులకు ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి .. కాసేపటికి తన అకౌంట్ ను డీయాక్టివేట్ చేసుకున్నారు. కానీ అప్పటికే వీడియో వైరల్ అయింది. టీడీపీ నేతలు సహా మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. అసలు ఇది ఈసీ ప్రాపర్టీ అని టీడీపీ నేతలకు ఎలా వచ్చిందో చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడం ప్రారంభించారు. గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే డిమాండ్ వినిపించారు.
మంత్రి అంబటి రాంబాబు అయితే అసలు ఇది ఫేక్ వీడియో అంటున్నారు.
ఇతర వీడియోలు కూడా రిలీజ్ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే సీఈవో మీనా మాత్రం ఈసీ ఈ దృశ్యాలు రిలీజ్ చేయలేదని ఎలా బయటకు వచ్చాయో దర్యాప్తులో తేలుతుందని ప్రకటించారు. మొత్తంగా ఈ వీడియో వ్యవహారం మాత్రం హైలెట్ అవుతోంది.