Siddham Meeting In Palnadu On March 3rd : సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార వైసీపీ జోరు పెంచుతోంది. ఇప్పటికే సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తోంది. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో మూడు సభలను నిర్వహించింది. రాయలసీమకు సంబంధించి కొద్దిరోజులు కిందట రాప్తాడులో సుమారు పది లక్షల మందికిపైగా ప్రజలతో సభను నిర్వహించిన వైసీపీ.. నాలుగో సిద్ధం సభకు డేట్‌ ఫిక్స్‌ చేసింది. ఈ సభను రాప్తాడు తరహాలో భారీ ఎత్తున నిర్వహించేందుకు అధికార పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాప్తాడు సభతో వైసీపీ కేడర్‌లో ఉత్సాహం పెరిగిందని, దాన్ని కొనసాగించేలా ఈ సభను నిర్వహించనున్నట్టు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే భారీ ఎత్తున ఏర్పాట్లు చేయబోతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సభను కనీసం ఐదు లక్షల మందితో నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. 


మేదరమెట్లలో నాలుగో సభ


నాలుగో సిద్ధం సభను పల్నాడు ప్రాంతానికి సంబంధించి నిర్వహిస్తున్నారు. మార్చి మూడో తేదీన బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్లలో నిర్వహించనున్నారు. ఈ సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్లపై తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలోని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఆయా జిల్లాలు పరిధిలోని 54 నియోజకవర్గాలు నుంచి కార్యకర్తలు సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలోనూ సీఎం జగన్మోహన్‌రెడ్డి కేడర్‌ను ఉత్సాహపరిచేలా ప్రసంగించనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 


మేనిఫెస్టో ప్రకటించేనా..?


వైసీపీ మేనిఫెస్టో ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాప్తాడు సభ వేదికగా మేనిఫెస్టోను సీఎం ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆ దిశగా సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రకటన చేయలేదు. ఎన్నికలు సభలు తరహాలోనే భారీ ఎత్తున సభలు వైసీపీ నిర్వహిస్తోంది. ఇదే చివరి సిద్ధం కావడంతో కేడర్‌కు దిశా, నిర్ధేశం చేయడంతోపాటు ప్రజలకు కూడా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఏం చేయబోతామన్న దానిపై సీఎం ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు. వైసీపీ నిర్వహిస్తున్న సభలు ప్రజల్లోకి జోరుగా వెళుతున్న నేపథ్యంలో.. చివరి సభలోనే మేనిఫెస్టో విడుదల చేయడం వల్ల మేలు కలుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి సీఎం జగన్‌ ఆ దిశగా ప్రకటన చేస్తారా..? లేదా..? అన్నది చూడాల్సి ఉంది.