Elections 2024 : ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ అంశంపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా నిబంధనలకు విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తోంది. టీడీపీ అడిగిందని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా మార్గదర్శకాలు రిలీజ్ చేశారని వెంటనే నిర్ణయం మార్చుకోవాలని మంగళవారం వైసీపీ నేత పేర్ని నాని ఈసీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సరైన స్పందన రాకపోవడంతో వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి సీఈసీకి మెయిల్ ద్వారా వినతి పత్రం పంపారు. మరో వైపు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ అంశంపై తాము కోర్టుకు వెళ్తామని ప్రకటించారు.
ఈసీ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే :
ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ చెల్లుబాటవుతాయి. 'ఫామ్ 13ఏ'పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. అలా ఉండి స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది. ఆర్వో సంతకంతో పాటు బ్యాలెట్ ధ్రువీకరించే రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలి. ఫామ్ 13ఏలో ఓటరు, ఆర్వో సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు. అలాగే, పోస్టల్ బ్యాలెట్ పేపర్‌పై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకపోయినా, ఆ ఓటు తిరస్కరించవచ్చు.' అని ఈసీ పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్‌ను తిరస్కరించాల్సిన పరిస్థితి వస్తే లోపలి కవర్ తెరవకుండా తిరస్కరించాలని, అది కూడా ఫారం-13ఏలోని డిక్లరేషన్, ఫారం-13సీ లోని కవర్ బీ లోపల కనిపించని పక్షంలో తిరస్కరించవచ్చంటూ ఈసీ సూచించింది. అలాగే డిక్లరేషన్‌పై ఓటర్లు సక్రమంగా సంతకం చేయకపోయినా, లోపభూయిష్టంగా ఉన్నా తిరస్కరించవచ్చని తెలిపింది. అంతేతప్ప ఆర్వో సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకి సంబంధం లేదని స్పష్టం చేసింది.
వైసీపీ అభ్యంతరం ఏమిటంటే ?
ఈసీ నిర్ణయంపై అధికార వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. గెజిటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారని, ఇప్పుడు కొత్తగా స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని ఎలా చెబుతారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని అంటున్నారు. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందని, ఈ నిబంధనలపై పునరాలోచించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌లో లేని సడలింపులతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని అంున్నారు. ఈసీ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్స్ చెల్లుబాటయ్యేలా చూడాలని ఉద్యోగ సంఘాల వినతి
మరో వైపు ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ చెల్లుబాటయ్యేలా చూడాలని ఉద్యోగ సంఘాలు ఈసీని కోరుతున్నాయి. ఉద్యోగులు తమ ప్రజాస్వామ్య హక్కును ఉపయోగించుకున్నారని సంతకాల పేరుతో చిన్న చిన్న తేడాలతో తిరస్కరించవద్దని కోరుతున్నారు.