YCP chief Jagan wife Bharti is taking charge of Pulivendula : ఏపీలో నామినేషన్లు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అందరూ ఏయే తేదీల్లో నామినేషన్లు వేయాలో సమయం చూసుకుంటున్నారు. సీఎం జగన్ ఏప్రిల్ 25న నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే రోజున పులివెందులలో బహిరంగసభ ఏర్పాటు చేయనున్నారు. అంతకు ముందే ఏప్రిల్ 22 ఉదయం 10:30 గంటలకు జగన్ తరపున ఓ సెట్ నామినేషన్ ను అవినాష్ రెడ్డి దాఖలు చేస్తారు.
నామినేషన్ దాఖలు అనంతరం రాష్ట్రవ్యాప్త ప్రచారంలో జగన్ బిజీ కానున్నారు. పులివెందులలో పార్టీ ప్రచారం బాద్యతలను తన సతీమణి వైఎస్ భారతికి అప్పగించనున్నారని సమాచారం. ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు పులివెందులలో ప్రచారాన్ని వైఎస్ భారతి దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ఎప్పుడు ఎక్కడ సభలు నిర్వహించాలని, ర్యాలీలు నిర్వహించాలి అన్న అంశాలను కూడా ఆమే పర్యవేక్షిస్తారని, పులివెందులలోని పార్టీ పెద్దల సహకారంతో ఆమె పార్టీ ప్రచారాన్ని విజయవంతం చేయడానికి సన్నద్ధం అవుతున్నారని సమాచారం.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీసీసీ అధ్యక్షురాలు పులివెందులలో ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా షర్మిల, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత రెడ్డి.. సీఎం జగన్ టార్గెట్‌గా ధ్వజమెత్తుతున్నారు. ప్రజలు నమ్మి ఇచ్చిన అధికారాన్ని జగన్.. హంతకులను కాపాడటానికి వినియోగుస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా షర్మిల విమర్శలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిపైకి జగన్ వదులుతున్న అస్త్రమే భారతి అని కూడా ప్రచారం సాగుతోంది. షర్మిల, సునీతకు ఘాటుగా బదులు ఇవ్వడానికే భారతిని రంగంలోకి దింపాలని జగన్ నిశ్చయించుకున్నారని వార్తలు వస్తున్నాయి.
సీఎం జగన్ బస్సు యాత్ర పూర్తి చేసిన తర్వాత నియోజకవర్గాల వారీగా బహింగసభల్లో ప్రసంగించాలనుకుటున్నారు. రోడ్ షోలు.. సభల్లో ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన పులివెందులపై పెద్దగా దృష్టి పెట్టే అవకాశం ఉండదు. ఈ సారి కడప లోక్ సభలో.. పులివెందులలో కుటుంబసభ్యులే పోటీ పడే అవకాశాలు ఉండటం.. వివేకా హత్య కేసే ఎన్నికల ఎజెండా మారడంతో.. భారతి కీలక బాధ్యతలు తీసుకోవడం కీలకంగా మారింది.