Andhra Pradesh News: రాష్ట్ర రాజకీయాలలో ఉరవకొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే వారి పార్టీ అధికారంలో ఉండదు అనేది నానుడి. అయితే ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో ఆ సెంటిమెంట్‌ను బద్దలు కొట్టే విధంగా రెండు ప్రధాన పార్టీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ బల ప్రదర్శన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బరిలో ఉన్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి పోటి చేస్తున్నారు. వీరిద్దరి మధ్య మూడో వ్యక్తి కూడా పోటీలోకి రావడంతో ఉరవకొండ రాజకీయం రసవత్తరంగా మారింది. ఆయనే ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి సొంత తమ్ముడు మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉరవకొండ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ప్రధాన పార్టీలతో పోటీపడుతూ నియోజకవర్గంలో రెడ్డి ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాడు. 


పయ్యావుల కేశవ్, విశ్వేశ్వర్ రెడ్డి మధ్య పోటీ  
ఉరవకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే టిడిపి నేత పయ్యావుల కేశవ్ ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తన ప్రధాన ప్రత్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డి నువ్వా నేనా అన్న రీతిలో ఢీ కొంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి తన జాతకాన్ని కూడా పరీక్షించుకోనున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి సిపిఎంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌లో పొత్తులో భాగంగా సీటు దక్కించుకొని 2004 ఎన్నికల్లో అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డిపై పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వేశ్వర్ రెడ్డి 2009 ఎన్నికల్లో రెండోసారి పయ్యావుల కేశవతో పోటీపడి ఓడిపోయారు. 


వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం మారిన పరిణామాలతో వైఎస్సార్సీపీ తరపున ఉరవకొండ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి మూడో సారి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. పయ్యావుల కేశవ్ పై విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో 2,275 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వేశ్వర్ రెడ్డి టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ్ చేతిలో 2,232 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రధాన పార్టీల నుంచి ఈ ఇద్దరు నేతలు పోటీ పడుతుండడంతో ఉరవకొండలో రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. 


వరుసగా 5 సారీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై పోటీపడుతున్న వై విశ్వేశ్వర్ రెడ్డి తన గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నాడు.  ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రధాన పార్టీల నుంచి ఈ ఇద్దరు బలమైన నేతలు పోటీ పడుతుండడంతో ఉరవకొండలో రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. 


ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బలం ఏంటి ? 
ఉరవకొండ నియోజకవర్గంలో కేశవ్ కుటుంబాన్నిదే ఆధిపత్యం. టిడిపి క్యాడర్ ప్రధాన బలం. అందులోనూ నియోజకవర్గంవ్యాప్తంగా కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం కలిసి వచ్చే అంశం. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి గెలిపిస్తుందని పయ్యావుల కేశవ్ ధీమాగా ఉన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఫల్యాలు నియోజకవర్గంలో అనేక సమస్యలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అది కలిసి వస్తుందని అంటున్నారు. 


విశ్వేశ్వర్ రెడ్డి బలం ఏంటి ?
ఐదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్సిపి నేత విశ్వేశ్వర్ రెడ్డి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గెలిపిస్తాయంటున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేకూరినట్లు వెల్లడించారు. ప్రజలకు అందించిన వేల కోట్ల రూపాయల ప్రయోజనాలే తనని గెలిపిస్తాయని విశ్వేశ్వర్ రెడ్డి విజయం తథ్యం అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 


మధ్యలో కాంగ్రెస్ నుంచి మధుసూదన్ రెడ్డి 
2 ప్రధాన పార్టీలు మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో పోటీలో నేను కూడా ఉన్నా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తమ్ముడు వై మధుసూదన్ రెడ్డి. తన అదృష్టాన్ని ఈ ఎన్నికల్లో పరీక్షించుకునేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం, వైఎస్ఆర్సీపి పాలన చూశారని ఈసారి కాంగ్రెస్‌కి అవకాశం ఇస్తారని నమ్మకంగా ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా,విభజన హామీలు అమలు, రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాల మ్యానిఫెస్టోలోని అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నామని అంటున్నారు. మొన్నటి వరకు వైఎస్ఆర్సిపిలో ఉన్న మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండడంతో  వైఎస్ఆర్సిపి ఓట్లను చీల్చుతారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మధుసూదన్ రెడ్డి బరిలో నిలవడం టిడిపికి కలిసి వస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


తీర్పు ఎటువైపు ?
నియోజకవర్గంలో ప్రధానంగా హంద్రీనీవా, తుంగభద్ర జలాశయం నుంచి వచ్చే నీటి మీద ఆధారపడి రైతులు ఎక్కువగా జీవనం కొనసాగిస్తుంటారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రధానంగా నేతలు సకాలంలో తాగునీటిని తాగు నీటిని అందిస్తామంటూ హామీలు గుప్పిస్తుంటారు. ప్రస్తుతం ఎన్నికల్లో కూడా ఇదే హామీలు ఇస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో విద్యావంతులు కూడా ఎక్కువగా ఉంటారు. నేతలు ఎవరికి వారు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓటర్లు ఎవరు వైపు నిలుస్తారు అన్నది ఆసక్తిగా మారింది.