Karnataka Election 2023 :  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని సంతోష పెడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో బీజేపీకి ఎంతో అడ్వాంటేజ్ అనే అభిప్రాయం ముందు నుంచీ ఉంది. అది నిజమే అందులో డౌట్ లేదు. ఇప్పుడు కర్ణాటక నుంచి అన్ని విధాలుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సాయం అందుతుంది. అయితే ఆ సాయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందుకునే స్థితిలో ఉన్నారా అన్నదే కీలకం. 


కర్ణాటకలో ఐక్యంగా పోరాడిన కాంగ్రెస్ నేతలు             


కర్ణాటక కాంగ్రెస్ లోనూ వర్గాల గొడవలు ఉన్నాయి.  కానీ ఆ పార్టీ నేతలు వర్గ పోరాటాల్ని ఎన్నికల వరకూ తెచ్చుకోలేదు.  కాంగ్రెస్‌లో సీఎం పదవికి ప్రధాన పోటీ దారులైన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ .. పోటీ పడ్డారు కానీ..  పార్టీకి నష్టం కలిగేలా ఎక్కడా ప్రవర్తించలేదు. ఎన్నికల తర్వాత సీఎం సీటు కోసం పోట్లాడుకోవాలంటే ముందు పార్టీ గెలవాలన్న లక్ష్యం వారికి  కనిపించింది. దాన్ని మర్చిపోలేదు. ఇరువుకూ కష్టపడ్డారు. విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తమ వర్గం ఎమ్మెల్యేలు ఓడిపోవాలని కుట్రలు చేసుకోలేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోలేదు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించింది.  


ముందు పార్టీ గెలిస్తేనే కదా తర్వాత పదవులు ! 


ముందు  పార్టీ గెలిస్తేనే ఎవరికైనా పదవులు వస్తాయి. ఆ విషయం మర్చిపోతే మొదటికే మోసం వస్తుంది. కాంగ్రెస్ నేతలు ముందు పార్టీని గెలిపించాలని లక్ష్యంగాపెట్టుకున్నారు.  తెలంగాణ కాంగ్రెస్ లో కూడా కర్ణాటక తరహాలో చాలా మంది నేతలు ఉన్నారు. టీ పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి తో  ప్రారంభించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే తామే సీఎం రేసులో ఉన్నామని చెప్పుకునేవారికి లెక్కే లేదు.   అసలు ముందు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే సీఎ పదవి అనే  మాట తెరపైకి వస్తుంది. అలాంటిది రాకపోయినా పర్వాలేదు.. తమకు కాకపోతే ఇంకెవరికీ సీఎం సీటు దక్కకూడదనే భావన ఎక్కువ మందికి ఉంది. కర్ణాటక ఫలితాన్ని చూసి.. తెలంగాణ నేతలు మారితే.. ఇక్కడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. 


 సొంత వర్గమే గెలవాలని ఇతరుల్ని ఓడించే ప్రయత్నం చేయని కాంగ్రెస్ నేతలు 


కాంగ్రెస్ విజయంలో మరో కీలక విషయం ఏమిటంటే.. తమ వర్గం వారే ఎమ్మెల్యేలుగా గెలవాలని వారు అనుకోలేదు. కుట్రలు చేసుకోలేదు. అందరూ తమ పార్టీ అభ్యర్థులేనన్నట్లుగా పోరాడారు. అందరి విజయం కోసం ప్రయత్నించారు. ఆర్థిక వనరులు సమకూర్చుకునే విషయంలోనూ వారెవరూ ఒకరకి తక్కువ.. మరొకరికి ఎక్కునే భావనకు పోలేదు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు కర్ణాటక విజయం ఓ బూస్ట్ ఇస్తుంది. ఇది ప్రజల్లో సెంటిమెంట్ పెంచుతుంది. అందులో సందేహం లేదు. దాన్ని అందుకుని తాము కూడా విజయం దగ్గరకు వెళ్లాలంటే కర్ణాటక కాంగ్రెస్ నేతల ఫార్ములాను పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.